అమెరికాలోని Federation of Indian Associations (FIA NY-NJ-CT-NE), న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, ప్రముఖ టెక్నాలజీ సంస్థ Zoho Corporation భాగస్వామ్యంతో న్యూజెర్సీలో కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు.

పార్సిప్పనీలోని Veterans Memorial Parkలో ఆగస్టు 15న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో “Largest Flagpole Number” విభాగంలో ఈ రికార్డు సాధించారు.

1,383 అమెరికా జెండాలతో ‘250’ ఆకారం

ఈ రికార్డు ప్రదర్శనలో మొత్తం 1,383 అమెరికా జెండాలను ఫ్లాగ్‌పోల్స్‌పై ఏర్పాటు చేసి ‘250’ అనే భారీ సంఖ్య ఆకారంలో రూపొందించారు.

ఈ భారీ ప్రదర్శన చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. భారత్‌ 80వ స్వాతంత్ర్య దినోత్సవం India@80, అమెరికా రాబోయే Semiquincentennial (America@250) వేడుకలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్థలంలో నిర్వహించిన పూర్తి పరిశీలన, ధృవీకరణ అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి అధికారికంగా రికార్డును ధృవీకరించి, FIA నాయకులు, ప్రముఖులకు సర్టిఫికెట్ అందించారు.

కమ్యూనిటీ ఐక్యతకు ప్రతీక

FIA చైర్మన్ అంకుర్ వైద్య ఈ విజయాన్ని భారతీయ-అమెరికన్ సమాజం ఐక్యత, అంకితభావం, సాంస్కృతిక వారసత్వంపై ఉన్న గర్వానికి ప్రతీకగా అభివర్ణించారు.

ఒకే లక్ష్యంతో సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చో ఈ రికార్డు నిరూపించిందని ఆయన అన్నారు.

భారత్-అమెరికా స్నేహానికి ప్రతీక

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ అంబాసిడర్ బినయ శ్రీకాంత ప్రధాన్ ఈ రికార్డును భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా పేర్కొన్నారు.

రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ-అమెరికన్ ప్రవాస సమాజం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

సేవా స్ఫూర్తిని ప్రశంసించిన నేతలు

పార్సిప్పనీ మేయర్ పుల్కిత్ దేశాయ్ భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య విలువలను ప్రస్తావించారు.

న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డా. డేల్ జి. కాల్డ్‌వెల్ భారీ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్లను అభినందించారు. కమ్యూనిటీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి వాలంటీర్ విజయమే

FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి ఈ రికార్డు ఒక్కరి విజయమేమీ కాదని.. కార్యక్రమం వెనుక పనిచేసిన ప్రతి వాలంటీర్, భాగస్వామి, మద్దతుదారుడి విజయమని అన్నారు.

ఈ భారీ జెండాల ప్రదర్శన సామూహిక శక్తి, దేశభక్తి, ప్రపంచ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి, Zoho Corporation USA హెడ్ రాజు వేగేశ్న, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు అనలిలియా మెజియాతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతీయ-అమెరికన్ల సేవలకు ప్రశంసలు

కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు టెక్నాలజీ, ప్రజాసేవ, వ్యాపారం, స్థానిక కమ్యూనిటీల అభివృద్ధిలో భారతీయ-అమెరికన్ సమాజం అందిస్తున్న విస్తృత సేవలను ప్రశంసించారు.

FIAకు ప్రత్యేక చరిత్ర

FIA మాజీ అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ ఈ రికార్డు సాధించడం వెనుక ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న టీమ్‌వర్క్, సంస్థాగత కృషి, కమ్యూనిటీ నిర్మాణం ఉన్నాయని తెలిపారు.

FIA చైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ.. సంస్థ గతంలో కూడా పలు గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రయత్నాలు చేసిందని, తాజా విజయం మాత్రం మొత్తం కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల ప్రత్యేకమైనదని అన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు

గిన్నిస్ రికార్డు ప్రదర్శన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు రికార్డు సృష్టించిన భారీ జెండాల ఏర్పాటును వీక్షించే అవకాశం కల్పించారు.

FIA గురించి

Federation of Indian Associations (FIA NY-NJ-CT-NE) 1970లో స్థాపించబడింది. అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో భారతీయ-అమెరికన్ సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రముఖ లాభాపేక్షలేని సంస్థగా FIA పనిచేస్తోంది.

భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు పౌర భాగస్వామ్యం, అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంస్థ కృషి చేస్తోంది.

Zoho Corporation గురించి

Zoho Corporation ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్‌వేర్, ప్రొడక్టివిటీ అప్లికేషన్లను అందించే ప్రముఖ టెక్నాలజీ సంస్థ. సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండగా, అమెరికా కార్యకలాపాలు టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి కొనసాగుతున్నాయి.