అమెరికాలోని తెలుగు ప్రవాసుల అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా గుర్తింపు పొందిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలకు సర్వం సిద్ధమవుతోంది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఈ ప్రతిష్ఠాత్మక మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఆటా బృందం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి G. కిషన్ రెడ్డి మరియు మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణలను మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు హాజరుకావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించింది.
సమావేశంలో మహాసభల ప్రాముఖ్యత, కార్యక్రమాల రూపకల్పన, అంచనా పాల్గొనేవారి సంఖ్య తదితర అంశాలను ఆటా ప్రతినిధులు వారికి వివరించారు. అలాగే భారతీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మహాసభల వేదికపై ప్రత్యేక టూరిజం స్టాల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ స్టాల్ ద్వారా భారతదేశ సంస్కృతి, వారసత్వం, పర్యాటక విశిష్టతలను వేలాది మంది ఎన్నారైలు, విదేశీయులకు పరిచయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, మహాసభల్లో కేవలం తెలుగు సమాజానికే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను సన్మానించనున్నట్లు వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలను గతంలో ఎన్నడూ లేనంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఆటా నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి సహా పలువురు కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. మహాసభల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.


















