అమెరికాలో తెలుగు సంస్కృతి, కళలను పరిరక్షిస్తూ ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడంలో ముందుండే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) డీఎంవీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ పేజెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. వర్జీనియాలోని లీస్‌బర్గ్ నగరంలోని ద్రోమవల్ల ఫార్మ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన పోటీదారులు, కమ్యూనిటీ నాయకులు, ప్రవాస తెలుగు కుటుంబాలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
తెలుగు సంస్కృతి, సృజనాత్మకతను ప్రతిబింబించిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సమాజం నుంచి విశేష స్పందన లభించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన బ్యూటీ పేజెంట్ లో 40 మందికి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. పోటీదారుల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక అవగాహన, స్టేజ్ ప్రెజెన్స్ వంటి అంశాలను న్యాయనిర్ణేతలు పరిశీలించారు. రాత్రి 11 గంటలకు ఉత్కంఠభరితంగా సాగిన విజేతల కిరీటధారణతో కార్యక్రమం ముగిసింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కన్వెన్షన్ కన్వీనర్ శ్రీధర్ బనాలా, కన్వెన్షన్ కోఆర్డినేటర్లు రవి చల్లా, జీనత్ కుందూర్, కౌశిక్ సామ, డైరెక్టర్ సుధీర్ దామిడిలతో పాటు పలువురు కమిటీ చైర్మన్లు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు హాజరయ్యారు.
ఈవెంట్‌ను విజయవంతం చేసిన బ్యూటీ పేజెంట్ చైర్, కమిటీ సభ్యులు, న్యాయనిర్ణేతలు, వాలంటీర్లు, స్థానిక కోఆర్డినేటర్ల కృషిని ఆటా నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమం సాధించిన విజయంతో 2026లో జరగనున్న 19వ ఆటా కన్వెన్షన్ మహాసభలకు మరింత ఉత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు. 19వ ఆటా మహాసభలు 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ నగరంలో నిర్వహించనున్నారు.

















