పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బీహార్ జిల్లాలో గ్రామస్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న “కట్ మనీ”ని జూన్ 4లోపు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిన టీఎంసీ నాయకురాలు జ్యోత్స్నా బర్మన్కు గుర్తు చేస్తూ గ్రామమంతా లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు.

ఘుగుమారి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు, గృహ పథకం ప్రయోజనాలు పొందేందుకు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు కమిషన్ చెల్లించాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ డబ్బును తిరిగి చెల్లిస్తామని స్థానిక టీఎంసీ నేతలు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనలను విరమించారు.

అయితే హామీ మరిచిపోకుండా ఉండేందుకు గ్రామస్తులు ప్రతిరోజూ లౌడ్‌స్పీకర్లలో జూన్ 4 గడువును గుర్తు చేస్తున్నారు. అంతేకాక ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహిస్తూ “కట్ మనీ” తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

జూన్ 4లోపు డబ్బులు తిరిగి చెల్లించకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. “కట్ మనీ” వ్యవహారం మరోసారి బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.