ప్రపంచంలోనే అతి భారీ గాల్ బ్లాడర్ స్టోన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వైద్యులు విజయవంతంగా తొలగించారు. సైఫైలోని యూపీ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది.

62 ఏళ్ల మహిళ గాల్ బ్లాడర్‌లో 200 గ్రాముల బరువున్న, 14 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు గల భారీ రాయిని గుర్తించారు. ఈ రాయి కారణంగా ఆమె చాలా కాలంగా తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నారు.

పరీక్షల అనంతరం పరిస్థితిని గుర్తించిన వైద్యులు, గాస్ట్రో సర్జన్ డాక్టర్ కన్నయ్య లాల్ చౌదరి నేతృత్వంలో లాపరోస్కోపిక్ పద్ధతిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. తక్కువ గాయంతో ఈ భారీ రాయిని విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్ చౌదరి తెలిపారు.

ఈ అరుదైన శస్త్రచికిత్స విజయంపై యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ అజయ్ సింగ్ వైద్య బృందాన్ని అభినందించారు. ప్రపంచ వైద్య చరిత్రలో ఇది ఒక విశేష ఘట్టంగా నిలిచే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.