గుజరాత్‌లోని సూరత్ జిల్లా బర్దోలీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊవా గ్రామం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన బస్సు మరో బస్సును ఢీకొనడంతో ఒక బస్సు అదుపుతప్పి డివైడర్ దాటి బోల్తా పడింది. అనంతరం బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.

సాయంత్రం 4 గంటల తర్వాత జరిగిన ఈ ప్రమాదంతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.