టమాటా రైతులకు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 25 కిలోల టమాటా బాక్స్‌ కేవలం రూ.30 నుంచి రూ.55కే అమ్ముడవుతోంది. అంటే.. రైతు చేతికి కిలోకు దక్కుతున్నది కేవలం రూ.2–3 మాత్రమే!

పెట్టుబడి సంగతి పక్కన పెడితే.. పంట కోసి మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు రైతులు టమాటాలను మార్కెట్‌కు తరలించకుండా పొలాల్లోనే పారబోస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలోనూ నాణ్యతను బట్టి కిలో టమాటాకు రూ.5–10 వరకు మాత్రమే ధర పలుకుతున్నట్లు సమాచారం. మరోవైపు రిటైల్‌ మార్కెట్లలో మాత్రం రూ.100కు 5–7 కిలోల వరకు టమాటాలు విక్రయిస్తున్నారు.

రైతు దగ్గర చిల్లర ధర.. వినియోగదారుడి దగ్గర మరో ధర.. మధ్యలో ధరల వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కనీస గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో టమాటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.