బిహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో ఎన్‌హెచ్-2పై జరిగిన బస్సు-లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన 65 ఏళ్ల లక్ష్మమ్మ తీవ్ర గాయాలతో పాట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.

ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లతో విమాన మార్గంలో నెల్లూరుకు తరలించింది.

దేవాదాయ శాఖ మంత్రి Anam Ramanarayana Reddy తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాలు పాట్నా నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి చెన్నైకి విమానాల్లో తీసుకువచ్చి అనంతరం రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేర్చారు. మరోవైపు 29 మంది యాత్రికులతో వస్తున్న ప్రత్యేక స్లీపర్ బస్సు భువనేశ్వర్ దాటి నెల్లూరు వైపు ప్రయాణిస్తోంది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.