చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య, మైనర్ కుమారుడికి ఆర్థిక మద్దతు ఇవ్వడం భర్త బాధ్యతేనని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. నిరుద్యోగం లేదా ఇతర వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేడని పేర్కొంది. గృహ హింస కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూ, తన కుమారుడి పోషణ కోసం నెలకు రూ.6 వేల భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది.
2015 నుంచి తండ్రి బిడ్డకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని అప్పీలేట్ కోర్టు గుర్తించింది. భార్య చదువుకున్నదనే కారణంతో భరణాన్ని నిరాకరించలేమని, సంపాదించే సామర్థ్యం ఉండటం వేరు, నిజంగా సంపాదించడం వేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మైనర్ కుమారుడు 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ప్రతి నెలా భరణం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.












