శైవ భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక “సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర” టూర్ ప్యాకేజీని ప్రకటించింది. జూన్ 16న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంటుంది.

సికింద్రాబాద్‌తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ స్టేషన్లలో కూడా ఎక్కే సౌకర్యం కల్పించారు. ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.17,600 నుంచి ప్రారంభమవుతుండగా, 3ఏసీకి రూ.26,700, 2ఏసీకి రూ.34,600గా నిర్ణయించారు. భోజనం, హోటల్ బస, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు ప్యాకేజీలో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించాలనుకునే భక్తులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.