వేసవి సెలవుల రద్దీతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. గురువారం సాయంత్రానికి శ్రీవారి దర్శనం కోసం భక్తులు 30 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం నుంచి ప్రారంభమైన రద్దీ ఆదివారం నుంచి మరింత పెరిగి, ఇప్పటికీ కొనసాగుతోంది. తీవ్ర ఎండల్లో 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోకి వెళ్లేందుకు భక్తులు అవుటర్ రింగ్ రోడ్ వరకు క్యూలో నిలుస్తున్నారు.

ఇక తిరుమలలో ట్రాఫిక్ సమస్యలు కూడా భక్తులను ఇబ్బంది పెడుతున్నాయి. సప్తగిరి బస్టాండ్ నుంచి వెంకటాద్రి నిలయం వరకు భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. నందకం సర్కిల్, రాంభగీచా సర్కిల్, లేపాక్షి బస్టాండ్ ప్రాంతాల్లో కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఒకవైపు వాహనాలు, మరోవైపు భక్తుల నడకతో రోడ్లు పూర్తిగా రద్దీగా మారాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2తో పాటు నారాయణగిరి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, దీర్ఘకాలం వేచి ఉండాల్సి రావడం భక్తులకు పరీక్షగా మారింది. వసతి సదుపాయాలపై కూడా భారీ ఒత్తిడి ఏర్పడింది.

భక్తుల ఇబ్బందులు తగ్గించేందుకు టీటీడీ అదనపు చర్యలు చేపట్టింది. బటగంగమ్మ సర్కిల్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు షేడ్ షెల్టర్లు ఏర్పాటు చేసింది. తాత్కాలిక టెంట్లు, అదనపు మరుగుదొడ్లు, కూల్ పెయింట్ పనులు కూడా చేపట్టింది. అయినప్పటికీ తిరుమలలో రద్దీ మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.