తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, గోవింద నామస్మరణ మధ్య గరుడ పతాకాన్ని ద్వజస్తంభంపై ఆవిష్కరించి తొమ్మిది రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

శ్రీ గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా చక్రత్తాళ్వార్ మరియు పరివార దేవతలతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరించారు. విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ హోమం, రక్షాబంధనం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధంతో స్నపన తిరుమంజనం చేశారు.

దశావతారాల అలంకరణలు, రంగురంగుల విద్యుద్దీపాలతో తిరుపతి నగరం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. సాయంత్రం ఉంజల్ సేవ, పెద్దశేష వాహన సేవల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.