కర్నూలు నగరంలో శాశ్వత ఘన వ్యర్థాల నిర్వహణకు భారీ ప్రాజెక్ట్ చేపడుతున్నారు.రూ.330 కోట్ల అంచనా వ్యయంతో వేస్ట్ టు ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే. పట్టాభిరామ్ తెలిపారు.
గార్గేయాపురం డంపింగ్ యార్డును పరిశీలించిన ఆయన.. 15 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంటుందని వెల్లడించారు.
అటు జోహరాపురం డంపింగ్ యార్డులో పేరుకుపోయిన దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఆధునిక వ్యర్థాల నిర్వహణలో భాగంగా మరో రూ.8 కోట్లతో 9.5 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇక ఇంటింటికీ చెత్త సేకరణ కోసం కొండారెడ్డి బురుజు వద్ద మంత్రి టీజీ భరత్‌తో కలిసి 30 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు. ఇంధన వాహనాల స్థానంలో వీటిని వినియోగించనున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తారు. త్వరలో మరో 61 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నట్లు మంత్రి భరత్ తెలిపారు.
కర్నూలు నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి సైతం రూ.140 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.









