గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
₹3,050 కోట్లతో చేపట్టిన గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 58 లక్షలకుపైగా ప్రజలకు ఫిల్టర్ చేసిన గోదావరి నీటిని అందించనున్నారు. ‘అమరజీవి జలధార’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను 2027 మార్చి నాటికి, గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
500 కిలోమీటర్లకుపైగా పైప్‌లైన్లు
ఈ ప్రాజెక్ట్‌లో 500 కిలోమీటర్లకుపైగా పైప్‌లైన్లను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులను కూడా నిర్మిస్తున్నారు.
మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో కాకినాడ, కోనసీమ జిల్లాలకు ₹1,650 కోట్లు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ₹1,400 కోట్లు కేటాయించారు.
కోనసీమలోని వసంతవాడలో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించనున్నారు. బొబ్బర్లంక నుంచి గోదావరి నీటిని అక్కడికి తరలించి శుద్ధి చేసిన అనంతరం 458 గ్రామాలకు సరఫరా చేయనున్నారు.
అదేవిధంగా దౌలేశ్వరం వద్ద మరో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించి.. అనపర్తి, బిక్కవోలు మీదుగా కాకినాడ జిల్లాలోని 234 గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని అందించనున్నారు.
పశ్చిమ గోదావరికి భారీ ప్రయోజనం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.86 TMC శుద్ధి చేసిన నీటిని 931 గ్రామాల్లోని 24.15 లక్షల మందికి అందించేలా ప్రణాళిక రూపొందించారు.
ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నరసాపురం, మొగల్తూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, పాలకొల్లు, తణుకు, భీమవరం తదితర మండలాలకు ఈ నీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరించనుంది. కొవ్వూరులో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా నిర్మించనున్నారు.
భూసేకరణ, ట్రాఫిక్ సమస్యలు సవాల్
ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
వసంతవాడలో 10 ఎకరాలు, మద్దూరులో 15.50 ఎకరాల భూమిని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం కోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇప్పటికే సేకరించింది.
పనుల నాణ్యతలో రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
కేంద్రం-రాష్ట్రం చెరో 50 శాతం నిధులు
ఈ ప్రాజెక్ట్‌ను జల్ జీవన్ మిషన్ కింద అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరో 50 శాతం నిధులు సమకూర్చనున్నాయి.
ఇదిలా ఉండగా.. గోదావరి నదిలోకి పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గోదావరి నీటి కాలుష్యాన్ని నియంత్రిస్తే ప్రజలకు మరింత నాణ్యమైన నీటిని అందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. పరిశ్రమలు వ్యర్థాల శుద్ధి మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉండటంతో.. అప్పటి వరకు ప్రజలకు ఫిల్టర్ చేసిన గోదావరి నీటినే సరఫరా చేయనున్నారు.









