
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ను వి శ్వనగరం చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాం చందర్‌రావు మండిపడ్డారు. తార్నాక డివిజన్‌కు చెందిన మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు విద్యావంతులు, స్థానికులు రాంచందర్‌రావు సమక్షంలో బిజెపిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాం చందర్‌రావు ప్రసంగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
బిజెపి విజయం సాధిస్తేనే కేంద్ర పథకాలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అందుతున్న సుపరిపాల న, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సమాజంలోని విద్యావంతులు, మేధావులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున బిజెపి వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సరైన మౌలిక వసతులు లేక, అధ్వానపు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, సమస్యలతో నగర ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతూ అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.











