
మన విదేశాంగ విధానం అద్భుతంగా సాగుతున్నదని బిజెపి ప్రభుత్వం, ఆ పార్టీ ఎంతైనా ప్రచారాలు చేసుకోవచ్చు గాక. కాని అది పాక్షిక సత్యం మాత్రమేనని వాస్తవాలను గమనించినప్పుడు స్పష్టమవుతుంది. పాక్షికం అనటం ఎందువల్ల? గత సుమారు ఆరు మాసాల కాలంలో పలు దేశాలు, ప్రాంతీయ సంస్థలు మనతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. కాని రాజకీయంగా చూసినప్పుడు విజయం అనదగ్గది ఏదీ కన్పించదు. వాస్తవానికి ఈ రెండింటిలో రాజకీయ రంగమే విదేశాంగ విధానానికి గీటురాయి అవుతుంది. ఆర్థికమన్నది పరస్పర ప్రయోజనాలకు సంబంధించింది. అందులో దౌత్యనీతి అంటూ ఏమీ ఉండదు ప్రత్యేకంగా.
ముందుగా రాజకీయాలు, దౌత్యనీతిని చూసి ఆర్థికానికి తర్వాత వెళదాము. ఆ విషయంలో భారతదేశానికి పొరుగుదేశాలు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, పశ్చిమాసియా, వేర్వేరు అగ్రరాజ్యాలు, మన భాగస్వాములుగా గల వివిధ సంస్థలన్నవి ప్రధానమైన కార్యరంగాలు. వీటిలో దేనికి సంబంధించిన పరిస్థితి కూడా సంతృప్తికరంగా కనిపించదు. దాదాపు అన్నిటా వెనుకబడి ఉన్నామనే అభిప్రాయమే కలుగుతుంది. ఇపుడు ఒక్కొక్కటిగా చూద్దాము.
నరేంద్ర మోడీ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తమ విదేశాంగ విధానంలో మొదటి ప్రాధాన్యత పొరుగు దేశాలకేనని అన్నారు. దానికి ఇంగ్లీషులో ‘నైబర్ హుడ్ ఫస్ట్’ అని పేరు పెట్టారు. ఆ ప్రకారం మొదట భూటాన్‌ను, తర్వాత రెండు నెలలకు నేపాల్‌ను సందర్శించారు. మరుసటి సంవత్సరం అనూహ్యంగా పాకిస్తాన్ వెళ్లారు. ఆ విధంగా, పొరుగు దేశాలతో సంబంధాల అభివృద్ధి గురించి ఆశాభావాలు కల్పించారు. కాని అప్పటి నుంచి 10 సంవత్సరాలకు పైగా గడిచిన వెనుక ‘నైబర్ హుడ్ ఫస్ట్’ అన్నది జాడలేకుండా పోయింది. సరికదా కొన్ని పొరుగు దేశాలతో సంబంధాలు మరింత క్షీణించాయి.
‘సార్క్’ కూటమి అంతకు ముందే బలహీనపడగా, మోడీ హయాంలో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు జరగకపోగా కనీసం ఆమాటైనా వినిపించటం లేదు. అది చాలదన్నట్లు రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు జరిగాయి. సింధూ జలాలను ఆపివేసి, నీటిని ఆయుధంగా ఉపయోగిస్తున్నామనే విమర్శలను ఎదుర్కొంటున్నాము. పాకిస్తాన్‌తో అసలు చర్చలు ఉండబోవని, చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్ గురించి మాత్రమేనని అసాధ్యపు వైఖరిని తీసుకుంటున్నాము. రెండు దేశాల యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నా, ఆయనకు తగిన సమాధానం ఇవ్వలేని దయనీయస్థితిలో మోడీ ప్రభుత్వం ఉంది. స్వయంగా ఆయనైతే నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడలేకపోతున్నారు. ఇంత పెద్ద దేశానికి, తన స్వతంత్ర విధానాల గురించి ఎంతగానో చాటిచెప్పుకునే ప్రభుత్వానికి ఇది విదేశాంగ విజయమవుతుందా లేక పరాభవమా? సింధూ జలాల విషయమై అంతర్జాతీయంగా మనకు మనం సమర్థించుకోలేకపోతున్నాము. ఆక్రమిత కశ్మీర్ విషయంలో ఎప్పటికైనా తేలేది అనుమానాస్పదమే. అదిగాక ఒక పొరుగు దేశంతో అసలు ఏ విషయంలోనూ శాశ్వతంగా చర్చల ప్రసక్తే లేదనే వైఖరి ఎటువంటి దౌత్యనీతి అవుతుంది?
చైనా విషయానికి వస్తే, దశాబ్దాలుగా గల సరిహద్దు సమస్యకు తోడు గల్వాన్ ఘటనల దరిమిలా సంబంధాలు అకస్మాత్తుగా క్షీణించాయి. మోడీ ప్రభుత్వ విధానం అమెరికా వ్యూహంతో ముడిబడిపోయిందనే అభిప్రాయాలు ఏర్పడగా, పసిఫిక్‌లో, దక్షిణ చైనా సముద్రంలో, క్వాడ్ తదితర కూటాలలో, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లతో కలిసి మనం చైనాకు వ్యతిరేకంగా పట్టుదలతో పని చేస్తున్నామనే అభిప్రాయాలను సృష్టించారు. అదే సమయంలో చైనాతో వాణిజ్యం అన్ని దేశాలకు మించిన స్థాయికి పెరిగిపోగా, ఇటీవల ఉన్నట్లుండి వారితో తిరిగి చర్చలు మొదలుపెట్టారు. ట్రంప్ వ్యూహాలు విస్తృత స్థాయిలో మారుతుండటం, ఆయన చైనాతో మైత్రికి ప్రయత్నిస్తుండటం, ఇండో పసిఫిక్ అనే సైనిక సంబంధ పదబంధం నుంచి ‘ఇండో’ను తొలగించటం, పసిఫిక్ దేశాలు తమ రక్షణ బాధ్యతలను ఇక తామే ఎక్కువగా చూసుకోవాలనటం, మితిమీరిన ట్యారిఫ్ల నుంచి జపాన్, దక్షిణ కొరియా సహా ఇండియానూ మినహాయించకపోవటం, వాణిజ్య ఒప్పందాలు తాము నిర్దేశించిన ప్రకారం చేసుకోవాలనటం వంటి పరిణామాలతో మోడీ ప్రభుత్వానికి అయోమయ స్థితి ఏర్పడింది. దానితో తిరిగి చైనా నుంచి పెట్టుబడులకు, సాంకేతిక సహకారాలకు, సంబంధాల మెరుగుదలకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విచిత్రమేమంటే చైనా తోపాటు బ్రిక్స్‌లో, షాంఘై సహకార సంస్థలో సభ్యత్వాలుండి, ఆ సంస్థల లక్షాల మేరకు క్రమంగా డీ డాలరైజేషన్ మార్గంలో పరోక్ష పద్ధతులలో సాగటం మరొక వైపు కనిపిస్తున్నది. వీటన్నింటి మధ్య చైనా పట్ల మోడీ విదేశాంగ విధానం ఏమిటన్నది బోధపడకుండా పోతున్నది. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్ ‘ఇండియాస్ వే’ అనే పుస్తకం రాసి, ఇక ముందు భారత విదేశాంగ విధానం గతంలో వలే ఏదో ఒక వైపు మొగ్గు చూపబోదని, ప్రపంచం గాని, మన అవసరాలు గాని ఒకప్పటికన్న మారిపోయాయి గనుక ఇక నుంచి అందుకు తగినట్లు అందరితో సంబంధాలు ఉంటాయని ప్రకటించారు. యథాతథంగా అది మంచిదే. కాని ఆచరణకు వచ్చేసరికి అమెరికన్ కూటమి వైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. అటువంటిది కాస్తా ట్రంప్ చపలచిత్త ధోరణితో గందరగోళంగా మారింది. ఇపుడు మనకు చైనా శత్రుదేశమో, మిత్ర దేశమో అర్థం కాకుండా పోతున్నది.
ఇక పొరుగు దేశాలలో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల సంబంధాలు ఏ విధంగా సాగుతున్నాయో కనిపిస్తున్నదే. నైబర్ హుడ్ ఫస్ట్ ప్రకారం గతం కన్న మెరుగుపడిందేమీ లేదు. ఆ విషయంలో గతం నుంచే బలహీనతలు ఉండగా అవి ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. సార్క్‌కు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతపు దేశాలతో కలిసి నడిపించదలచిన ఇతర సంస్థలేవీ ముందుకు సాగటం లేదు. అందరూ అంటీముట్టనట్లే ఉంటున్నారు. అందుకు కారణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మనపై నమ్మకం, ప్రేమలేకపోవటం.
ఈ విధంగా పొరుగు దేశాలు, దక్షిణాసియా పోగా, లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ అంటూ ఆడంబరంగా ప్రకటించిన విధానాల ప్రకారం ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలు మన బలహీన విధానాల వల్ల అరకొరగా సాగుతుండగా, రాజకీయంగా వారెవరి వ్యూహాలలోనూ మనం ఒక ఆసియా దేశంగా భాగస్వాములం కాము. అదంతా అమెరికా వ్యూహాలపై ఆధారపడి ముందుకు వెనుకకు సాగుతుంటుంది. ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, భౌగోళికంగా ఒక కీలకమైన ప్రాంతంలో గల దేశం అయినప్పటికీ ఎక్కడా స్వతంత్రత కనిపించదు. అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగానే ఈ ప్రాంతాల దేశాలతో సైనిక ఒప్పందాలు జరుగుతుంటాయి. అందులో నిజంగా ఇండియా రక్షణకు అవసరమైనవి ఏమిటో అర్థం కాదు.
ఇక పశ్చిమాసియా విషయం. వాస్తవానికి ఆ ప్రాంతపు రాజకీయాలు, రక్షణ వ్యూహాలు, ఆర్థిక వ్యవహారాలు అన్నీ మొదటి నుంచి భిన్నమైనవే. అవి చాలా కాలం పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రయోజనాలు, ఇంధన వనరులు చుట్టూ తిరిగాయి. అందులో భాగం సూయెజ్ కాలువ, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ల రవాణా మార్గాల చుట్టూ. రెండవ ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ సృష్టి దశల నుంచి అమెరికా ప్రవేశించింది. అప్పటి నుంచి అంతా అమెరికా, ఇజ్రాయెల్‌ల ప్రయోజనాలు, పాలస్తీనా ఏర్పాటు కాకుండా అడ్డుకోవటం, అరబ్ రాజ్యాలను తమ వైపు తిప్పుకోవటం, ఇరాన్‌ను లొంగదీయటం లేదా విచ్ఛిన్నం చేయటమన్నదే సర్వస్వంగా మారింది. నేటి వరకు ఇదే పరిస్థితి. దీనంతటిలో భారతదేశపు పాత్ర పరిమితం. ఒకప్పుడు పాలస్తీనా సమర్థకురాలిగా ఉండిన గుర్తింపు క్రమంగా మసకబారిపోయింది.
ఇప్పుడు ఉన్నది అమెరికా వ్యూహంలో భాగంగా మారటం, వివిధ కారణాల వల్ల ఇజ్రాయెల్‌కు సన్నిహితం కావటం మాత్రమే. ఆ విధంగా రాజకీయమైన పాత్ర గాని, గౌరవం గాని ప్రస్తుతం ఏమీ మిగలలేదు. ఉన్నవన్నీ ఆర్థిక సంబంధాలు ఒక్కటే. అక్కడి నుంచి చమురు, గ్యాస్ కావాలి. మన పౌరులకు ఉద్యోగ, ఉపాధులు లభించాలి. వారు పంపే డాలర్ చెల్లింపులు అవసరం. వీలైనన్ని పెట్టుబడులు రాబట్టాలి. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం అమెరికా, ఇరాన్‌తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపైనా ఆంక్షలను ప్రకటించింది. అందుకు కాదనే ధైర్యం మనకున్నదా?
ఈ విధమైన సంబంధాలు, పాత్ర కూడా ఇరాన్ యుద్ధంతో బలహీనపడటం మొదలైంది. అక్కడ ఒకవేళ శాంతి యత్నాలు, లేదా వేర్వేరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు జరిగినా భారత దేశపు పాత్ర ఏమీ లేని పరిస్థితి వచ్చి వేసింది. అంతకుమించి ఆందోళన చెందవలసింది మరొకటి జరుగుతున్నది. అది మనం బద్ధ శత్రువులని భావించే పాకిస్తాన్, చైనాల పాత్ర పెరుగుతుండటం. మొదట పాలస్తీనా గ్రూపుల మధ్య సయోధ్యను, తర్వాత ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య అవగాహనలను చైనా కుదిర్చింది. ఇరాన్ యుద్ధం మొదలైనాక పాకిస్తాన్‌కు సలహాలు ఇస్తూ మధ్యవర్తిగా మార్చింది. ఆ తర్వాత దశలో స్వయంగా అమెరికా, ఇరాన్‌లు రాజీ యత్నాలలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు, ఒమాన్లకు బాధ్యతలు అప్పగించాయి. ఇంకా తర్వాత ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, సౌదీలు పరస్పర రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. తాజా వార్తలను బట్టి అందులో బంగ్లాదేశ్ కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చుట్టుప్రక్కల ఏ ప్రాంతం వైపు చూసినా నరేంద్ర మోడీ కాలం నుంచి మన విదేశాంగ విధానం ఎంత అయోమయంగా మారుతున్నదో అర్థమవుతుంది. ఈ స్థితి ఏ విధంగా మెరుగుపడగలదో చెప్పగల పరిస్థితి కూడా కనిపించటం లేదు.
భారతదేశం చాలా పెద్దది, ఇక్కడ వనరులు, మార్కెట్లు విస్తారమైనవి గనుక వేర్వేరు దేశాలతో ఆర్థిక ఒప్పందాలు విరివిగా జరుగుతుండటం ఒక్కటే సంతోషించవలసిన విషయం. అయితే, ఈ విషయంలోనూ మనం మాటలకు తగిన స్థాయిలో ఇతరులతో పోటీ పడలేకపోతున్నాము. కనుక ఫలితాలు మిశ్రమ స్థితిలో ఉంటున్నాయి.
టంకశాల అశోక్
(రచయిత సీనియర్ సంపాదకులు)











