
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బి ఆర్ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను వి జయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని సూచించారు.
వెయ్యి రోజుల వైఫల్యాలపై
వారం రోజుల పోరాటంఈ మేరకు శుక్రవారం పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి.. వాటిలో ఎన్ని అమలయ్యాయి..ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి..? అనే అంశాలను ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2 నుంచి వారం పాటు నిరసన కార్యక్రమాలు
వారం రోజుల కార్యాచరణకి ముందుగా సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను వేస్తూ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం పార్టీ నిర్వహిస్తుందని కెటిఆర్ తెలిపారు. ఆ తర్వాత వరుసగా వారం రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.సెప్టెంబర్ 2న కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని చెప్పారు. సెప్టెంబర్ 3న రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న 22ఎ నిషేధిత జాబితా భూముల సమస్యపై ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 4న మహిళలు, వికలాంగులు తదితర వర్గాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని కెటఆర్ సూచించారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువత సమస్యలపై ప్రత్యేకంగా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
అదిలాబాద్‌లో సీసీఐ సమస్యలు, సింగరేణి ప్రాంతాల్లో ఆయా వర్గాల సమస్యలపై ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించాలని కెటిఆర్ తెలిపారు. సెప్టెంబర్ 7న జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని వ్యక్తం చేసే వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యం, ప్రజలకు జరిగిన మోసంపై ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వారం రోజుల కార్యక్రమాల అనంతరం సెప్టెంబర్ 8న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు నిర్వహించి, ఆయా జిల్లాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. సెప్టెంబర్ 10న జరగనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు కూడా బిఆర్ఎస్ సంఘీభావం ప్రకటించాలని సూచించారు.











