మన తెలంగాణ/హైదరాబాద్: స్టార్ ఇమేజ్, పాన్ ఇండియా, భారీ బడ్జెట్ల నమూనా చట్రాలను దాటి ‘భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత’ కథా చిత్రాల విజయ పరంపరలతో భారతీయ సినిమా సరికొత్త వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. సినిమా అంటే భారీ బడ్జెట్, అగ్రతారలు, అద్భుతమైన గ్రాఫిక్స్ కోట్లాది రూపాయల ప్రచా రం, ఇవే విజయానికి కొలమానాలుగా భావించిన కాలం నుంచి పరిస్థితి క్రమంగా మారుతోంది. ఇప్పుడు భారతీయ సినిమా ఆ పాత సమీకరణాలను నెమ్మదిగా తిరగరాస్తోంది. కథలో నిజాయితీ, భావోద్వేగంలో బలం, ప్రేక్షకుడి వి శ్వాసంతో అనుసంధానమైతే తక్కువ బడ్జెట్ సినిమా కూడా బాక్సాఫీస్ వ ద్ద సంచలనం సృష్టించగలదని వరుస విజయాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా భక్తి, ఆధ్యాత్మికత, దైవత్వం, విశ్వాసం లేదా ఒక బలమైన నమ్మకాన్ని కథలో అంతర్భాగం చేసుకున్న సినిమాలు ఇటీవలి కాలంలో సాధిస్తున్న విజయాలు భారతీయ సినిమా ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోందనే సంకేతాన్ని ఇస్తున్నాయి.


‘షోలే’కు దీటుగా ‘జై సంతోషి మా’

ఇది ఇప్పుడే కొత్తగా మొదలైన నయా ట్రెండ్ లా కనిపిస్తున్నప్పటికీ.. .దీనికి సినిమా చరిత్రలో సుమారు యాభై ఏళ్ల కిందటే ఒక అసాధారణమైన ఉదాహరణ ఉంది. 1975లో ఒకవైపు భారీ తారాగణం, భారీ నిర్మాణ విలువలతో వచ్చిన ‘షోలే’. మరోవైపు అత్యంత పరిమిత బడ్జెట్‌తో వచ్చిన ‘జై సంతోషి మా’...రెండు సినిమాల స్థాయి వేరు. కథా ప్రxపంచాలు వేరు. నిర్మాణ విలువలు వేరు. కానీ ప్రేక్షకుల స్పందనలో ‘జై సంతోషి మా’ సంచలనం సృష్టించింది. మొత్తం వసూళ్లలో ‘షోలే’నే అగ్రస్థానంలో నిలిచినా, అత్యల్ప పెట్టుబడిపై వచ్చిన లాభదాయకతలో ‘జై సంతోషి మా’ అసాధారణ విజయాన్ని అందుకుంది. భక్తి, విశ్వాసం, సామాన్య కుటుంబ ప్రేక్షకుడి భావోద్వేగం ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అంటే భారతీయ ప్రేక్షకుడికి సినిమా అత్యంత ఖరీదైనదై ఉండాల్సిన అవసరం లేదని, తన నమ్మకానికి దగ్గరగా ఉండాలని అప్పుడే ఒక చిన్న సినిమా చాటి చెప్పింది.

‘కార్తికేయ’ నుంచి కథ మారింది..

దశాబ్దాల తర్వాత ఈ ధోరణి మరో రూపంలో కనిపించింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సంప్రదాయ భక్తి చిత్రం కాదు. దేవాలయం, దైవ విశ్వాసం, రహస్యం, శాస్త్రీయ ఆలోచనలను కలిపిన మిస్టరీ థ్రిల్లర్. పరిమిత స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనను, వాణిజ్య విజయాన్ని అందుకుంది. అందులోని విశ్వాసం-మిస్టరీ కలయికే తరువాత మరింత విస్తృతమైన కథా ప్రపంచానికి బాట వేసింది. ఆ విజయానుభవం తర్వాత వచ్చిన ‘కార్తికేయ 2’ మరింత పెద్ద పరిధిలో కృష్ణతత్వం, భారతీయ పురాతన జ్ఞానం, ఆధ్యాత్మిక రహస్యం, అడ్వెంచర్‌ను కలిపింది. ఇది ఒక ముఖ్యమైన పరిణామం. భక్తిని పాతకాలపు కథగా కాకుండా, ఆధునిక ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే కథా వస్తువుగా మార్చడం. ఇదే ప్రయోగం తరువాత మరెన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది.

‘కాంతారా’ నుంచి ‘హనుమాన్’ వరకు

‘కాంతారా’ మరో కీలక మలుపు. ఇది దేవుడి పురాణగాథ కాదు. కానీ స్థానిక దైవ విశ్వాసం, భూమి, సంప్రదాయం, ప్రకృతి, మనిషి మధ్య సంబంధాన్ని ఆధ్యాత్మిక అనుభూతితో ముడిపెట్టింది. ఒక ప్రాంతీయ విశ్వాసం పాన్-ఇండియా ప్రేక్షకుడికి కూడా అనుభూతిగా మారగలదని నిరూపించింది. తర్వాత ‘హనుమాన్’ మరింత భిన్నమైన ప్రయోగాన్ని చూపించింది. సూపర్‌హీరో కథను హనుమంతుడిపై ఉన్న భారతీయ విశ్వాసంతో ముడిపెట్టి, ఆధునిక విజువల్ ఎఫెకట్స్, యాక్షన్, గ్రామీణ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలను కలిపింది. ఇక్కడ భక్తి పాత రూపంలో లేదు. భక్తి ఆధునిక సినిమా భాషను ధరించింది.

ఇప్పుడు ‘ఇరుముడి’

ఈ పరిణామానికి ప్రస్తుతం అత్యంత బలమైన ఉదాహరణ ‘ఇరుముడి’. ఇందులో దేవుడి మహిమను మాత్రమే చూపించడమే కథ కాదు. ఒక సాధారణ తండ్రి జీవితం, అతని అలవాట్లు, కుటుంబ సంబంధాలు, కూతురితో అనుబంధం, తన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం-ఇవన్నీ అయ్యప్ప విశ్వాసంతో ముడిపడతాయి. తండ్రి తన కూతురి కోసం అయ్యప్ప దీక్ష చేపట్టడం, ఆ దీక్షలో భాగంగా తనలోని చెడు అలవాట్లను విడిచిపెట్టడం& క్రమంగా ఒక మనిషిగా పరివర్తన చెందడం& ఇవన్నీ ప్రేక్షకుడికి కేవలం భక్తిని కాదు, మనిషి మార్పును చూపిస్తాయి. అందుకే ‘ఇరుముడి’ విజయం మన వ్యాసానికి అత్యంత ముఖ్యమైన ఉదాహరణ. సుమారు రు.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 2 నాటికి ప్రపంచవ్యాప్తంగా రు. 200 కోట్ల గ్రాస్‌ను దాటినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇది కేవలం బాక్సాఫీస్ నంబర్ కాదు.. ఒక తండ్రి-కూతురు అనుబంధాన్ని అయ్యప్ప విశ్వాసంతో కలిపిన భావోద్వేగ కథను ప్రేక్షకులు తమదిగా స్వీకరించారన్నది అసలు విజయం.

భక్తి అంటే దేవుడి కథ మాత్రమే కాదు ఇక్కడే ఈ కొత్త ధోరణికి అసలు అర్థం కనిపిస్తుంది.భక్తి సినిమా అంటే ఇక దేవుడి జీవితచరిత్ర మాత్రమే కాదు. ఒక దైవ విశ్వాసం కావచ్చు. ఒక స్థానిక సంప్రదాయం కావచ్చు. ఒక పురాతన తత్వం కావచ్చు. ఒక సాధువు జీవితం కావచ్చు. లేదా కష్టాల్లో ఉన్న మనిషిని నిలబెట్టే ఒక నమ్మకం కావచ్చు. గుజరాతీ చిత్రం ‘లాలో’లో సాధారణ మనిషి జీవితంలో కృష్ణుడిపై ఉన్న విశ్వాసం కథకు ఆధారమైంది. ‘మహావతార్ నరసింహ’ వంటి చిత్రాలు పురాణాన్ని యానిమేషన్, ఆధునిక సాంకేతికతతో కొత్త తరానికి అందిస్తున్నాయి. అంటే భక్తి పాత కథలను మళ్లీ చెప్పడం కాదు. పాత విశ్వాసాలకు కొత్త కథా భాషను ఇవ్వడం.


నిర్మాతలకు కనిపిస్తున్న కొత్త మార్గం

ఈ సినిమాల విజయాల్లో మరో ముఖ్యమైన పాఠం ఉంది. భారీ బడ్జెట్ సినిమా విఫలమైతే నష్టం కూడా భారీగానే ఉంటుంది. కానీ పరిమిత బడ్జెట్‌తో, బలమైన కథతో తీసిన సినిమా ప్రేక్షకుడికి నచ్చితే దాని ప్రచారానికి ప్రేక్షకుడే వాహకుడవుతాడు. అదే వర్డ్ ఆఫ్ మౌత్. ఒక కుటుంబం చూసి మరొక కుటుంబానికి చెప్పడం, ఒక భక్తుడు మరో భక్తుడికి చెప్పడం ఒక ప్రేక్షకుడు మరో ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడం, ఇలా నమ్మకం ప్రచారంగా మారుతుంది. ప్రచారం బాక్సాఫీస్‌గా మారుతుంది. భారతీయ సినిమా దేవుడిని మాత్రమే తెరపైకి తీసుకురావడం లేదు. మనిషి నమ్మకాన్ని తెరపైకి తీసుకొస్తోంది. అదే ఈ సినిమాల అసలు బలం. ప్రేక్షకుడు ఇప్పుడు కేవలం స్టార్‌ను చూడటానికి థియేటర్‌కు రావడం లేదు.

తన భావోద్వేగాన్ని చూడటానికి వస్తున్నాడు. తన విశ్వాసాన్ని గుర్తించడానికి వస్తున్నాడు. తనలోని ఆశకు ఒక రూపాన్ని చూడటానికి వస్తున్నాడు. అందుకే రేపటి భారతీయ సినిమా విజయాన్ని నిర్ణయించే ప్రశ్న& ఈ సినిమాలో ఎంత డబ్బు పెట్టారు? అనేది కాకపోవచ్చు. ఈ కథను ప్రేక్షకుడు ఎంత బాగా నమ్మాడు? అనేదే కావచ్చు. ఎందుకంటే& స్టార్ ఇమేజ్ సినిమా ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావచ్చు. కానీ నమ్మకం సినిమాను ప్రేక్షకుడి హృదయంలో నిలబెడుతుంది. అదే ఇప్పుడు భారతీయ బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్న కొత్త అద్భుతం. విజయ రహస్యం.