
ఏపీలోని ప్రకాశం జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన హత్యోదంతం పోలీసుల దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి నమ్మిన బంధువే అప్పుచ్చిన మహిళను చంపి ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి.. పొలంలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడుకు చెందిన ఆదిలక్ష్మి (32)కి, అర్థవీడు మండలం వీరభద్రాపురానికి చెందిన సమీప బంధువు రాజమ్మ.. లక్షకు లక్ష రెట్టింపు వడ్డీ ఇస్తానని ఆశ చూపించింది. తొలుత కొద్దిగా డబ్బులు ఇస్తే నమ్మకంగా తిరిగిచ్చింది. దీంతో రెట్టింపు డబ్బు వస్తుందని ఆశపడ్డ ఆదిలక్ష్మి తన నగలను అమ్మి ఇచ్చింది. భర్త వద్దు అని వారించినా వినకుండా ఇతరుల వద్ద అప్పులు చేసి మరీ ఏకంగా రూ. 50 లక్షలు రాజమ్మకు ముట్టజెప్పింది. అయితే చెప్పిన సమయానికి రాజమ్మ తీసుకున్న నగదు, వడ్డీ తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేసింది.
డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదిలక్ష్మి గట్టిగా నిలదీయడం మొదలుపెట్టింది. దీంతో నిందితురాలు హత్యకు ప్లాన్ వేసింది. డబ్బు ఇస్తానని ఇంటికి రమ్మని చెప్పింది. జూన్ నెలలో ఆదిలక్ష్మీని తన ఇంటికి పిలిచి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చింది రాజమ్మ. తరువాత స్పృహ కోల్పోయిన ఆదిలక్ష్మీ గొంతు నులిమి హత్య చేసింది రాజమ్మ. ఆ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాన్ని ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి, గ్రామ సమీపంలోని పంటపొలంలో పాతిపెట్టింది. ఆదిలక్ష్మి సెల్‌ఫోన్‌ను నీటికుంటలో పడేసింది. భార్య కనిపించడం లేదంటూ జూన్ 26న భర్త బాలగురువయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జులై 21న కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదిలక్ష్మి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూపీ లాగారు. చివరి టవర్ లొకేషన్‌తో నిందితురాలిని, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దారుణం బయటపడింది. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో పొలంలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు. ***











