
సెయింట్ లూయిస్: భారత యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌తో నయా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఛాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. దీంతో ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారత గ్రాండ్ మాస్టర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరునావాతో జరిగిన పోరులో ప్రజ్ఞానంద 1513 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆట చివరి రోజు ప్రారంభంలో ప్రజ్ఞానంద ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఒక దశలో ఆరు పాయింట్లతో వెనుబడి పోయాడు. ఇలాంటి స్థితి నుంచి ప్రజ్ఞానంద అనూహ్యంగా పుంజుకున్నాడు. అసాధారణ ఆటతో ఫాబియానోను ముప్పుతిప్పలు పెట్టాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ లక్షం దిశగా సాగాడు. వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్‌లను గెలుచుకుని ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి వరకు నిలకడైన ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక టైటిల్‌తో పాటు రెండు కోట్ల రూపాయల నగదు బహుమతిని కూడా దక్కించుకున్నాడు.
సిఎం రేవంత్ అభినందనలు
ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అతి చిన్న వయసులో ఇలాంటి టైటిల్‌ను గెలిచి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ గెలుచుకోవాలని సిఎం రేవంత్ ఆకాంక్షించారు.











