
లాతూరు: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందని, విద్యార్థులకంటే ‘మంత్రుల కుక్కలకే మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని’ అని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజిత్ దీప్కే అన్నారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత వారం తన బృందం ప్రారంభించిన ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా లాతూరు జిల్లా ఔసా తాలూకాలోని ఉజాని గ్రామంలోనున్న జిల్లా పరిషత్ పాఠశాలను దీప్కే సందర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల దుస్థితికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులను చేయాలన్నారు. అనేక పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు, సురక్షిత రహదారులు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తప్పుపట్టారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువులకంటే దారుణంగా చూస్తున్నారని ఆరోపించారు. ‘ఇది విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన విషయం. విద్యార్థుల కోసం రాజకీయ నాయకులు ఏమీ చేయనప్పుడు వాళ్లకు ప్రజలెందుకు ఓటు వేయాలి? ప్రజలు ఓట్లు వేయడం వల్లే వాళ్లు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ప్రజలు కూడా తమ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారో చూడాలి.ఈ పాఠశాలల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ముందుగా విద్యకోసం పనిచేసి ఆ తర్వాతే ఓట్లు అడగాలని ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నేతలను కోరాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్ధం చేసుకోవాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అన్నారు. సీజేపీ చేపట్టిన పాఠశాలల తనిఖీల కారణంగా ఇప్పటికే కొన్నిచోట్ల పనులు ప్రారంభించినట్టు చెప్పారు.








