
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలను కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. గురువారం మహాబలిపురంలో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాలుగు ప్రధాన అంశాలపై కేంద్రం, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని, పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు ఏపి వాటా నిధులు విడుదల చేయాలని, ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, భద్రాచలం, ఏలూరు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేలా కేంద్రాన్ని కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచలం పరిసరాల్లోని యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని తుమ్మల కోరారు. ఈ ఐదు పంచాయతీల పరిధిలో 19 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వాటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 11,122.01 ఎకరాలు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నప్పటికీ, భౌగోళికంగా తెలంగాణతోనే ఎక్కువ అనుసంధానం కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని వివరించారు. పరిపాలనా సేవలు, వైద్యం, విద్య, మార్కెట్లకు వెళ్లడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల రవాణాలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు సమస్యగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులకు సమీపంలోని ఈ ప్రాంతంలో భద్రతా వ్యవస్థల సమన్వయానికి కూడా ప్రస్తుత భౌగోళిక విభజన ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా, ఆలయానికి సంబంధించిన భూముల్లో కొంత భాగం పురుషోత్తపట్నంలో ఉండటం వల్ల పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ భౌగోళిక అసమానతను సరిచేసేందుకు కేంద్రం జోక్యం చేసుకుని ఐదు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 2024 జూలై 18న భారీ వర్షాలకు దెబ్బతిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును శాశ్వతంగా పునరుద్ధరించేందుకు రూ.92.20 కోట్లు అవసరమని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 16 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, మొత్తం ఆయకట్టులో 85.25 శాతం(13,640 ఎకరాలు) ఏపి పరిధిలోనే ఉందన్నారు.
శాశ్వత పునరుద్ధరణ వ్యయాన్ని ఆయకట్టు నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలు భరించాలని, ఏపీ తన వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబును కోరారు. గత ఫిబ్రవరిలోనే విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయం పెండింగ్‌లో ఉందని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఆలస్యం చేయరాదని తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులకు ఆదాయ భద్రత కల్పించేందుకు గెలలు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తుమ్మల కోరారు. భద్రాచలం నుంచి దమ్మపేట, చింతలపూడి మీదుగా ఏలూరు వరకు ఉన్న సుమారు 160, 165 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని మంత్రి కోరారు.











