శిథిలాల క్రింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన రెస్క్యూ టీమ్

నేపాల్ ఆకస్మిక వరదల్లో 1,344కు చేరిన మృతుల సంఖ్య

జాడ తెలియని 5,000 మంది కోసం ముమ్మరంగా గాలింపు

ఖాట్మండూ: నేపాల్‌ను అతలాకుతులం చేసిన మెరుపు వరదల అనంతరం సహాయక బృందాలు చేపట్టిన ముమ్మర గాలింపులో 11వ రోజైన శనివారం మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. రసువా జిల్లాలోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయిన చైనా జాతీయుడిని సజీవంగా ఉన్నట్టు గుర్తించి బయటకు తీసుకువచ్చారు. వెంటనే అతన్ని వైద్య పరీక్షలకు తరలించారు. రసువా జిల్లాలోని వరద ప్రభావిత అప్పర్ త్రిశూలి-1 హైడ్రోపవర్ ప్రాజెక్టులోని ఆడిట్ టన్నెల్-4లో లుహైతావో అనే చైనా జాతీయుడిని నేపాల్ సైన్యం, దక్షిణ కొరియాకు చెందిన విపత్తు సహాయక నిపుణులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రక్షించినట్టు నేపాల్ సైన్యం తెలిపింది. దీంతో ఇంతవరకు సొరంగాల్లో చిక్కుకున్న ముగ్గురిని సజీవంగా బయటకు తీసుకువచ్చినట్టు అయింది. శుక్రవారంనాడు త్రిశూలి-3ఎ జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి ఇద్దరు నేపాలీ వ్యక్తులను రెస్క్యూ టీమ్ కాపాడింది.

కాగా, సువాకోట్ జిల్లా బిదూరి పట్టణానికి చందిన 60 ఏళ్ల మహిళ చంద్రికా శ్రేష్ఠను కూడా సాయుధ పోలీసు బలగాల బృందం శనివారం రక్షించింది. మట్టి, శిథిలాల క్రింద పూర్తిగా కూరుకుపోయిన నాలుగు అంతస్తుల భవనం పై అంతస్తులో 11 రోజుల పాటు ఆమె చిక్కుకుపోయింది. ఆపస్మార్మక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి చికిత్స కోసం త్రిశూలిలోని నేపాల్ ఆర్మీ మైథిలీ బ్యారక్స్‌కు తరలించారు.

కాగా, నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శనివారం నాటికి 1,344కు చేరింది. ఇప్పటికీ ఆచూకీ తెలియకుండా పోయిన సుమారు 5,000 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. గల్లంతైన వారిలో 589 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటి వరకూ 13,000 మందికి పైగా ప్రజలను రక్షించినట్టు అధికారులు తెలిపారు. భారత సొరంగ రక్షణ బృందం సైతం నేపాల్ ఆర్మీతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్‌లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని అధికారులు చెబుతుండగా, వీరిలో 500 మంది సొరంగాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.