
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసు సిబ్బంది దాష్టీకం చేశారన్న ఆరోపణలపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్పీఈసీ)ని సుప్రీంకోర్టు గురువారం ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఇందులో పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్ సభ్యులుగా ఉంటారు. కమీటీ సభ్యుల వ్యక్తిగత నైపుణ్యం,అనుభవం, కమిటీలోని వైవిధ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి.మోహనతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
కమిటీ చేసే సిఫార్సులు ఈ కేసులో కోర్టుకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విచారణ ఒక్కసారితో ముగిసే ప్రక్రియ కాకూడదని, సమస్యలను కమిటీ నిరంతరం, కాలానుగుణంగా పరిశీలిస్తూ మధ్యంతర నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించింది. మహిళా నిరసనకారులపై జరిగినట్టు ఆరోపణలు వచ్చిన లక్ష్యిత హింస, వేధింపులు, మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఘటనలను ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించింది.
పోలీసులు, భద్రతా సిబ్బంది చర్యలతో నిరసనకారులతో హాని కలిగిందన్న ఆరోపణలపై కూడా కమిటీ పరిశీలించాలని, అధిక బలప్రయోగానికి దారితీసిన కమాండ్ చైన్, బాధ్యులెవరు, బలప్రయోగంలో చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలు ఉల్లంఘించారా అనే అంశాలపై కూడా దర్యాప్తు చేయాలని ధర్మాసనం పేర్కొంది. జూన్ 20న పార్లమెంటు వైపు నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని మార్చ్ సందర్భంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటచేసుకున్నాయి. జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.








