
ఓస్లో: నార్వే దేశ రాజు హరాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. అయిదో హెరాల్ చక్రవర్తి కన్నుమూసినట్టు రాయల్ ప్యాలెస్ వర్గాలు శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపాయి. రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న హరాల్డ్ ఆగస్టు 17న ఓస్లోలోని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించాయి. ఆయన మరణంతో నార్వే కిరీటం ఆయన కుమారుడైన 53 ఏళ్ల హాగన్-8ను వరించనుంది.
దివంగత హరాల్ యూరప్‌లో అత్యంత వృద్ధ చక్రవర్తిగా ఉన్నారు. ఎంతో ప్రజాదరణ పొందిన ఆయన రాజకుటుంబ వ్యవస్థను ఆధునీకరించారు. వయోభారంతో ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి కట్టుబడి కొనసాగారు. 1937లో ఓస్లో సమీపంలో అస్కర్‌లో ఆయన జన్మించారు. 1905లో స్వీడన్-నార్వే సమాఖ్య రద్దయిన తర్వాత హరాల్ తాత హోకోస్ 7వ రాజుగా ఎన్నిక కావడంతో నార్వేకు మళ్లీ స్వతంత్ర రాజకుటుంబం ఏర్పడింది. 1991లో హరాల్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. నాజీల ఆక్రమణల సమయంలో చిన్నతనంలో అమెరికాకు ప్రవాసం వెళ్లిన ఆయన, యూరప్‌కు చెందిన పలువురు రాజకుటుంబ మహిళలను కూడా కాదని సాధారణ మహిళను వివాహం చేసుకున్నారు.











