లేహ్/జమ్మూ: లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ కశ్మీర్-లడఖ్ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదేశాలు జారీ చేశారు. దీంతో భౌగోళికంగా మారుమూల ప్రాంతమైన లడఖ్ ప్రజలకు ఉన్నత న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. ‘ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్ (సిట్టింగ్ ఆఫ్ ది బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లడఖ్ ఇన్ లడఖ్) రెగ్యులేషన్, 2026’ పేరుతో రాష్ట్రపతి గురువారంనాడే ఉత్తర్వు జారీ చేశారు.

అదే రోజు గెజిట్‌లో ప్రచురించారు. కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నిబంధనతో లడఖ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి నిబంధనను జారీ చేయడాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా స్వాగతించారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న ఏడు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడటం కేంద్ర ప్రభుత్వ వేగవంతమైన చర్యకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.