
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో కర్నాటక ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి బి. నాగేంద్ర శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 25 రోజులకే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను కలసి తర్వాత కొద్దిసేపటికే రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ‘నేను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ మీడియా ఎదుట నాగేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామా లేఖను డీకే శివకుమార్‌కు సమర్పించినట్లు తెలిపారు. వాల్మీకి కార్పొరేషన్ వ్యవహారంపై గతంలోనూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్రను రెండేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి
తీసుకోవడంపై ప్రతిపక్ష బిజెపి, జెడి(ఎస్) తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటక స్టేట్ మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన రూ.89 కోట్ల కుంభకోణంలో నాగేంద్రకు ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేషన్‌లోని అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రాజీనామా తర్వాత నాగేంద్రపై ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు తనను కొందరు కావాలనే రాజకీయంగా లక్షంగా చేసుకున్నారని నాగేంద్ర ఆరోపించారు. దేశంలో ఒక గిరిజన వ్యక్తి ఎదగడం ఇష్టం లేకే మనువాదులు ఇలాంటి చర్యలకు పూనుకున్నారని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి మండిపడ్డారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, ప్రజల తీర్పు కోసం వెళ్తానని నాగేంద్ర స్పష్టం చేశారు.











