మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ నడుం బిగించారు. వచ్చే నెల 5, 6న 22ఏ సమస్యపై నిరసన దీక్ష నిర్వహించాలని, 7న ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌పై ఇంది రా పార్కు వద్ద మహా ధర్నా చేయాలని నిర్ణయించారు. బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రా ష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసేందు కు శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో స మావేశమై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం

కానున్నందున ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకుపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 5, 6న 22ఏ సమస్యపై ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టాలని, 7న ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌పై ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా హాజరుకావాలని నిర్ణయించారు. ఫీజు రీ-యంబర్స్‌మెంట్ అంశంపై మహా ధర్నా నిర్వహణ బాధ్యతను బిజెవైఎంకు అప్పగించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్,


పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్. గౌతం రావు. టి. వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతం రావు ఈ వివరాలు వెల్లడించారు. ఇంకా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో త్వరలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బీజాపూర్ హైవే పనులు, వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలిస్తారని ఆయన చెప్పారు.