
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాకు పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎటువంటి హడావుడి లేకుండా ప్రారంభించిన నిరసనలు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ప్రభుత్వ విద్యారంగం వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ఆందోళనలకు దారితీస్తుంది. ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం ఢిల్లీలో జన్ జెడ్ నిరసనగా ప్రారంభమైన ఈ ఆందోళనలు నేడు జన్ ఆల్ఫా ఉద్యమంగా మారుతున్నాయి. గత మూడు వారాలుగా, పాఠశాల విద్యార్థులు తమ తరగతి గదుల నుండి బయటకు వచ్చి, ప్రభుత్వ కార్యాలయాల వరకు ప్రదర్శనలు నిర్వహించి, పాఠశాల గేట్లకు తాళాలు వేసి, రోడ్లపై కూర్చొని అధికారుల నుండి సమాధానాలు కోరుతున్నారు. వారి డిమాండ్లు చాలా ప్రాథమికమైనవి. వారికి ఉపాధ్యాయులు, తరగతి గదులలో ఫ్యాన్లు, లైట్లు, డెస్కులు వంటి ప్రాథమిక సౌకర్యాలు, తినదగిన ఆహారం, శుభ్రమైన తాగునీరు, పనిచేసే మరుగుదొడ్లు కావాలి. కొన్ని సందర్భాల్లో పాఠశాలకు సరైన రహదారిని కూడా వారు కోరుతున్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నిరసనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న తన గ్రామం నుండి ‘స్కూల్ ఠీక్ కరో’ (పాఠశాల సరిదిద్దుకోండి) ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవలి జన్ జెడ్ నిరసనల స్ఫూర్తితో మొదలైనట్లు కనిపించిన ఈ నిరసనలు, ఇప్పుడు మరో భారీ ప్రజా సమీకరణకు నాంది పలికేలా కనిపిస్తున్నాయి. ఈసారి జన్ ఆల్ఫా దీనికి ముందుండి నడిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కిషన్‌పూర్‌లో ఉన్న సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు జాతీయ దృష్టిని ఆకర్షించిన వారిలో మొదటివారు. జూన్ -జులైలో జరిగిన జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొన్న నలుగురు 12వ తరగతి విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లి పాఠశాలలో ఈ నిరసనను నిర్వహించారు. వారిలో ఒకడైన అంకుర్ సోంకర్, ఢిల్లీ నిరసన నుండి తాను ఒక సాధారణ పాఠాన్ని నేర్చుకున్నానని చెప్పాడు: మీ హక్కుల కోసం పోరాడండి.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో, ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడం లేదా 6-10 కిలోమీటర్ల దూరంలోకి తరలించే ప్రణాళికలకు వ్యతిరేకంగా వందలాది మంది పాఠశాల బాలికలు నిరసన తెలిపారు. అక్కడ సమస్య కేవలం మౌలిక సదుపాయాలకు మించిపోయింది. ముఖ్యంగా ఒక బాలికకు, ఆమె అసలు పాఠశాలకు వెళ్తుందా లేదా అనేది దూరంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ నిరసనలు కేవలం పాడైన ఫ్యాన్లు, మురికి టాయిలెట్లు లేదా భౌతిక మౌలిక సదుపాయాల కొరతకు సంబంధించినవి మాత్రమే కాదు. ఉద్యమానికి ఊపు రావడం నిస్సందేహంగా ఒక కారణమే అయినా, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, స్థానిక ప్రతినిధులు వంటి సంప్రదాయ పరిష్కారాలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే మార్గాలు ఫలించలేదనే భావనల కారణంగా కూడా ఈ నిరసనలు చెలరేగుతున్నాయి. ఆన్లైన్లో కనిపించడం అనేది నిజ ప్రపంచంలో ఒక శక్తి స్వరూపమని జన్ జెడ్ నిరసనలు నిరూపించాయి. ఈ డిజిటల్ తరం వారు తమ దైనందిన జీవితాన్ని, తమ సహజ జీవన విధానాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు.
ఇప్పుడు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి ఒక నమూనా అందుబాటులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి. స్మార్ట్ఫోన్లలో తీసిన పోస్టర్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిన్న వీడియోలు స్థానిక సమస్యలను ప్రజా సమస్యలుగా మారుస్తున్నాయి. ఒక వ్యాఖ్యాత అన్నట్లుగా, ఇప్పుడు ‘జన్ ఆల్ఫా’ తమ స్క్రీన్ల నుండి వీధుల్లోకి అడుగుపెడుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ ఉపయోగించాలని ఆదేశించాల్సి వచ్చింది. అంతేకాదు, మంత్రులు గత రెండున్నర నెలల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యవహరించారో తెలిపే నివేదికలను ఒకొక్కరికి అందజేశారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఉన్న రాంపుర కన్వాపుర గ్రామంలో ప్రభుత్వ స్కూల్‌ను సిజెపి బృందం పరిశీలించేందుకు ఇటీవల వెళ్లగా వారిపై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ స్కూల్‌ను సందర్శించడానికి సిజెపి వెళ్తుంటే దాడి చేయడం ఏంటని తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు విద్యార్థులను శనివారం వేరే బిల్డింగ్‌లోకి తరలించారు. మరోవైపు రాజస్థాన్‌లో ఏకంగా 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. రాజస్థాన్‌లో 2,047 పాఠశాలల్లో ఇప్పటికీ సరైన మరుగుదొడ్లు లేవని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వెల్లడైనది. సిజెపి పర్యటనలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల రిపేర్లకు రూ. 550 కోట్లు కేటాయిస్తున్నామని, రూ.450 కోట్లు కొత్త బిల్డింగుల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలో దశాబ్దాలుగా సార్వత్రిక పాఠశాల విద్య, విద్యా హక్కు, ప్రతి బిడ్డకు సమాన అవకాశం వంటి విషయాలపై కేవలం మాటలకే పరిమితమైంది.
అయినప్పటికీ, అణగారిన పిల్లల అనుభవం తీవ్రమైన అసమానతలతో కూడుకుని ఉంది. తన హక్కుగా దక్కాల్సిన దానిని పొందడానికి ఒక చిన్నారి కలెక్టరేట్ వరకు 5 కిలోమీటర్లు ఎందుకు నడవాలి? పాఠశాల చాలా దూరంలో ఉందని ఆమె ఎందుకు చదువు మానేయాలి? ఇది ప్రాథమిక సౌకర్యాల కన్నా కూడా అత్యంత ప్రాథమికమైన సమస్య: ఇది ‘విద్యను పొందే అవకాశం’, పేదరికం నుండి బయటపడే మార్గం, సామాజిక ఉన్నతికి ఒక అవకాశం వంటి వాటికి సంబంధించినది. ఇటువంటి మౌలిక ప్రశ్నలను ఇప్పుడు బాలబాలికలు లేవనెత్తడం నిజంగా దేశంలోని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశాలు. లూటియన్స్ ఢిల్లీలోని కేంద్ర మంత్రుల నివాసాల వార్షిక నిర్వహణ వ్యయం 2014- 15లో రూ. 27 కోట్లు ఉండగా, 2025 -26 నాటికి అది రికార్డు స్థాయిలో రూ. 92 కోట్లకు పెరిగిందన్న నివేదిక నేపథ్యంలో ‘మీ విలాసవంతమైన నివాసాలను బాగు చేయడం మానేసి, పాఠశాలలను బాగు చేయండి’ అని సిజెపి పేర్కొంది. రూ. 92 కోట్లతో 10 ‘ప్రపంచ స్థాయి’ ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపింది. ప్రైవేట్ పాఠశాలలకు పంపే స్తోమత లేని కుటుంబాల పిల్లలకు విద్యాహక్కును వాస్తవ రూపంలో అందించడంలో, ఆ ప్రాప్యతను కల్పించడంలో ప్రభుత్వ పాఠశాలల పాత్రను మరింత లోతుగా పరిశీలించేలా జన్ ఆల్ఫా నిరసనలు ప్రేరేపిస్తాయని ఆశిద్దాం. గత దశాబ్ద కాలంలో, తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలను మూసివేయడాన్ని సూచించే అధికారిక పదం ‘హేతుబద్ధీకరణ’. ఈ పేరుతో 90,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేశారు.
నీతి ఆయోగ్ పవర్ పాయింట్లో, ఈ ‘హేతుబద్ధీకరణ’ అంటే వనరులను సమీకరించడం, ‘ఎకానమీస్ ఆఫ్ స్కేల్’ సాధించడం అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో దీని అర్థం ఏమిటంటే, గిరిజన కుగ్రామంలో లేదా ఒబిసి గ్రామంలోని ఒక పిల్లవాడు ఇప్పుడు ప్రతిరోజూ అదనంగా 4 లేదా 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పల్లెటూరి అమ్మాయికి ప్రోత్సాహకరమైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, పాఠశాలకు చేరుకోవడానికి ఒకవైపు 5 కిలోమీటర్లు నడవడానికి వారు అనుమతించే అవకాశాలు ఎంత? అందుకే, ప్రాథమిక స్థాయిలో చేరికలు తగ్గడం, సంవత్సరాల తర్వాత మొదటిసారిగా స్థూల నమోదు నిష్పత్తులు పడిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? సర్వ శిక్షా అభియాన్, విద్యా హక్కు చట్టం చేసిన మేలు ఏమాత్రం సరిపోవడం లేదు. కానీ రాజ్యాంగ హక్కుగా ప్రతి బిడ్డకు నడిచి వెళ్ళే దూరంలో ఒక పాఠశాల ఉండటం ఒక మంచి ఆరంభం. ఈ నష్టాన్ని పూడ్చడానికి, పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసే నిరసనల కన్నా ఎక్కువే అవసరం. విద్య పొందే అవకాశం ఒక హామీగా కాకుండా ఒక ప్రత్యేక హక్కుగా మారినప్పుడు, అసలు వాస్తవం ఏమిటో తెలుస్తుంది.
చలసాని నరేంద్ర
98495 69050











