
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 10 మంది విద్యార్థినులు విశ్వవిద్యాలయ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు మేలో అందినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. విచారణ కొనసాగుతోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ పేరును ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఫిర్యాదుల ప్రకారం.. సదరు ప్రొఫెసర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశాలకు విద్యార్థినులను ఆహ్వానించేవారని, అక్కడ వారితో అనుచితంగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదుల్లోనూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు విద్యార్థినులు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఒక విద్యార్థిని తనకు ఎదురైన అనుభవాన్ని మే రెండో వారంలో విద్యార్థుల అనధికారిక వాట్సాప్ గ్రూపులో పంచుకోవడంతో.. మరికొందరు విద్యార్థినులు కూడా ఇలాంటి ఆరోపణలతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
మే మొదటి వారంలో జరిగిన మౌఖిక పరీక్షల (వైవా) సందర్భంగా ప్రొఫెసర్ లైంగిక భావజాలంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థినులు తన లైంగిక ప్రతిపాదనలకు అంగీకరిస్తే అదనపు మార్కులు ఇస్తానని చెప్పినట్లు కూడా కొందరు ఆరోపించారు. ఈ ఆరోపణల అనంతరం ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు అందింది. కమిటీ ఇప్పటికే పలువురు విద్యార్థినులను పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదులపై ఐసీసీ విచారణ ఇంకా పూర్తికాలేదు. అందువల్ల ఆరోపణలు నిర్ధారణ కాలేదు. ఈ విషయంపై జేఎన్‌యూ పరిపాలనా విభాగం, ఉపకులపతి కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఢిల్లీ పోలీసుల ప్రకారం.. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. ఐసీసీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి వివరాలు వెలువడాల్సి ఉంది.








