
మనతెలంగాణ / సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులు, పదహారు మంది వినియోగదారులను గచ్చిబౌలి, ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 95.41 గ్రాముల ఎండిఎంఏ, 50 గ్రాముల ఓజి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.16.40లక్షలు ఉంటుంది. శేరిలింగంపల్లి డిసిపి చింతమనేని శ్రీనివాస్, ఎస్‌ఓటి డిసిపి శోభన్‌కుమార్ కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం, త్రీసూర్‌కు చెందిన ఎండి రజల్ అబ్దుల్ గఫూర్(26) బెంగళూరులో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు, నవీనా కెడి, ఎపిలోని , తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొరిపెళ్ల యశ్వంత్ సాయి శణ్ముఖ్ నగరంలోని కూకట్‌పల్లిలో ఉంటున్నాడు.
ఎండి రజల్, నవీన కలిసి నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి డెడ్‌డ్రాప్ పద్ధతిలో సరఫరా చేస్తున్నాడు. నవీన ఫ్రాన్స్ దేశంలో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న సమయంలోనే డ్రగ్స్ వినియోగించేది. ఇండియాకు వచ్చిన తర్వాత రజల్‌తో కలిసి డ్రగ్స్ తీసుకోవడంతోపాటు విక్రయిస్తున్నారు. గ్రాముకు రూ.10వేల చొప్పున అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉంటున్న యశ్వంత్‌కు బస్సులో పార్సిల్ రూపంలో బెంగళూరు నుంచి డ్రగ్స్ పంపిస్తున్నారు. వాటిని తీసుకుంటున్న యశ్వంత్ వినియోగదారులు వాట్సాప్, ఇన్‌స్టాలో మెసేజ్, ఫోన్లు చేసి డెడ్‌డ్రాప్ పద్ధతిలో డెలివరీ చేస్తున్నాడు. వీరి వద్ద 16మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు, అందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 16మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
దీంతో ప్రత్యేక పోలీసు బృందాలను కేరళ, బెంగళూరుకు పంపి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మహ్మద్ రజల్ డ్రగ్స్‌ను ‘సామ్’ అనే నైజీరియన్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.








