
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో సామాన్య కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 22ఏలో తమ భూములు చేర్చడంతో బాధితులు తెలంగా ణ భవన్‌కు వచ్చి మాజీ మంత్రి హరీష్‌రావుకు తమ ఆవేదనను తెలియచేశారు. దీంతో తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సబితారెడ్డిలు మాట్లాడారు.
బాధితులకు భరోసానిచ్చారు. బాధితుల ఆవేదనను విన్న మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాల వల్ల, కమీషన్ల దాహం వల్ల లక్షలాది మంది సామాన్యుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆయన మండిపడ్డారు. బాధితుల తరఫున బిఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ లోపల, బయట పోరాడుతుందని, 22ఏ నిషేధిత జాబితా పేరుతో జరుగుతున్న దందాను అరికట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏరియా నుంచి 22-ఏ బాధితులు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో 22-ఏ బాధితులకు బిఆర్‌ఎస్ సపోర్ట్ ఉంటుందన్నారు.
చార్జీలు చెల్లించిన తర్వాత 22ఏలో
ఉందన్నారు: మోహన్ రెడ్డి
రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని, స్టాంప్ డ్యూటీ చార్జీలు మొత్తం చెల్లించిన తర్వాత తీరా రిజిస్ట్రేషన్ రోజున మీ ఆస్తి 22 ఏ నిషేధిత జాబితాలో ఉందని చెప్పారు.
ప్రభుత్వమే మమ్మల్ని అనాథలను చేస్తే మా ఆవేదనను ఎవరు వింటారు.
2017లో బ్యాంకు లోన్ తీసుకొని
ఇల్లు కొన్నా: రాజేష్
2017లో బ్యాంకు లోన్ తీసుకొని కాలనీ మధ్యలో ఇల్లు కొనుకున్నా. ఇటీవల ఉద్యోగం పోవడంతో ఇల్లు అమ్ముకుని వ్యాపారం చేసుకుందామని జూలై 1న రిజిస్ట్రేషన్ ఆ ఫీస్‌కు వెళ్తే మా ఆస్తి 22ఏ లో ఉందని చెప్పారు. తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుని రెండు నెలలైనా ది క్కులేదు. ఇల్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేశాను, ఆయన లోన్ ఈఎంఐ కూడా కడుతున్నారు. కానీ, రిజిస్ట్రేషన్ కావడం లేదు. కాలనీ మధ్య లో ఉన్న ఇల్లు ఉన్నట్టుండి 22ఏలోకి ఎలా పోతుంది.
1995లోనే లే ఔట్ అనుమతులు పొందాం:
దేవేందర్ రావు (హెచ్‌ఎమ్‌టీ హౌసింగ్ కాలనీ)
1995లోనే లే ఔట్ అనుమతులు పొంది వందలాది ఇళ్లు నిర్మించుకున్నాం. కానీ, సర్వే నంబరు 330ని ఒక్కసారిగా 22ఏలో పెట్టారు. గత జూలైలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చినా దానిని చెత్తబుట్టలో వేశారు. ప్లాట్లు కొనుక్కున్న మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
యూఎల్‌సీ పేరుతో ఆపారు: బి.ఎన్. రెడ్డి
మా కాలనీలో 1500 ఇళ్లు ఉన్నాయి. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రస్తుతం ఈ భూముల రిజిస్ట్రేషన్‌లను యూఎల్‌సీ పేరుతో ఆపేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించినా ఎలాంటి పరిష్కారం చూపలేదు.
బిఆర్‌ఎస్ పార్టీయే మమ్మల్ని కాపాడాలి:శ్రీనివాస్
10 ఏళ్ల క్రితం క్లియర్ డాక్యుమెంట్లతో, బ్యాంకు లోన్ ద్వారా ప్రాపర్టీ కొన్నా. అవసరం ఉండి అమ్ముకుందామని స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ప్రొహిబిషన్ లిస్టులో ఉందన్నారు. రెండు సర్వే నంబర్ల సాకుతో కాలనీ మొత్తం 22ఏ లో పెడితే సామాన్య కుటుంబాల పరిస్థితి ఏమిటీ? బిఆర్‌ఎస్ పార్టీయే మమ్మల్ని కాపాడాలి.








