
అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
ఇది భుజంపై నుంచి శత్రువు పైకి ప్రయోగించే ట్యాంక్ విధ్వంసకర క్షిపణి
ఇరుదేశాల ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్న యూఎస్
న్యూఢిల్లీ: భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు మరో కీలక అస్త్రం రాబోతోంది. అధునాతన జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారంనాడు వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత లోతుగా, సమర్ధవంతంగా, కీలకమైనదిగా మారుతోందనడానికి నిదర్శనమని అన్నారు. అయితే భారత్ ఎన్ని జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వ్యవస్థలను కొనుగులు చేయనుంది, కొనుగోలు మొత్తం విలువ ఎంతనే వివరాలు వెంటనే తెలియలేదు.
జావెలిన్ ప్రత్యేకతలివే..
జావెలిన్ ట్యాంక్ విధ్వంసకర క్షిపణిని భుజంపై ఉంచుకుని శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ట్యాంకును ధ్వంసం చేసేలా ఇందులో రెండు దశల్లో పేలుడు పదార్ధాలు ఉంటాయి. తొలి దశలో రక్షణ కవచాలను ఛేదిస్తుంది. ఆ తర్వాత దశలో వారెహెడ్ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణరంగ దిగ్గజాలు రేథియాన్, లాక్‌హీడ్ మార్టీన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ధర దాదాపు 2 లక్షల డాలర్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.
జావెలెన్ వ్యవస్థ మధ్యశ్రేణి ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్ వ్యవస్థ. దీనిని అమెరికా ఆర్మీ, అమెరికా మెరైన్ కారప్స్‌తో పాటు పలు దేశాలు ఉపయోగిస్తున్నాయి. సాయుధ వాహనాలు, పటిష్ట రక్షణ స్థావరాలు, సహా వివిధ రకాల లక్ష్యాలను ఎదుర్కొనేందుకు దీనిని రూపొందించారు. కాగా, అమెరికా-భారత్ మధ్య రక్షణ పారిశ్రామిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పరస్పర ప్రయోజనకరమైన సహ ఉత్పత్తి (కో-ప్రొడక్షన్)తో పాటు, మరిన్ని అవకాశాలపై చర్చలకు కూడా ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని యూఎస్ తెలిపింది.











