అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి నిఖిత గొడిశాల (27) హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిందితుడిని తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా పోలీసుల అభ్యర్థన మేరకు నిందితుడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్లు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్తె నిఖిత గొడిశాల ఎంఎస్ చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అనంతరం అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు. నిఖితకు అర్జున్ శర్మతో అమెరికాలో చదువుకునే సమయంలో పరిచయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 2న నిఖిత కనిపించడం

లేదంటూ ఆమె మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసి భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే అతడి వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన అమెరికా పోలీసులు మరుసటి రోజు అతడి అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు. అక్కడ నిఖిత మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 డిసెంబరు 31నే హత్య జరిగి ఉండొచ్చని అమెరికా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, హత్య అనంతరం అర్జున్ శర్మ అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు గుర్తించిన అమెరికా పోలీసులు భారత అధికారులను సంప్రదించారు. అంతర్జాతీయ స్థాయిలో గాలింపు చేపట్టి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లోనూ అర్జున్ శర్మపై కేసు నమోదైంది.