
మన తెలంగాణ/హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అం బేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి, తెలంగాణ రైతాంగానికి తొలుత ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోందని రా ష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే తెలంగాణ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 80 టిఎంసీల ప్రాణహిత జలాలను భారీ ఎత్తిపోతలు అవసరం లేకుండా సహజ గురుత్వాకర్షణ ద్వా రా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ-, మహారాష్ట్ర మధ్య జరగనున్న కీలక అంతర్రాష్ట్ర
చర్చల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం సాయంత్రం ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, ఇంజినీర్- ఇన్- చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్‌బాబుతో పాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ సమావేశంలో తెలంగాణ తరఫున వినిపించాల్సిన సాంకేతిక, న్యాయపరమైన వాదనలు, 152 మీటర్ల బ్యారేజీ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, గురుత్వాకర్షణ ద్వారా నీటి తరలింపు సాధ్యాసాధ్యాలను కూలంకషంగా సమీక్షించారు.
అంతర్రాష్ట్ర అంశాలు ప్రధానంగా చర్చకు
సెప్టెంబర్ 1వ తేదీన జరిగే అంతర్రాష్ట్ర సమావేశానికి కేంద్ర జల సంఘం (సీడబ్లూసీ) చైర్మన్ అధ్యక్షత వహిస్తారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు సీడబ్ల్యూసీలోని కీలక డైరెక్టరేట్ల అధిపతులు ఇందులో పాల్గొంటారన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అంతర్రాష్ట్ర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ-, మహారాష్ట్ర మధ్య అధికారిక చర్చల ప్రక్రియ ప్రారంభం కావడమే ప్రాణహిత పునరుజ్జీవనంలో ఒక కీలక ముందడుగని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ కేంద్రంతో నిరంతరం జరిపిన సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాల ఫలితంగానే ఈ చర్చలకు మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి మొదట ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
గత రాష్ట్ర ప్రభుత్వం 2016లో అంగీకరించిన 148 మీటర్ల స్థాయికి బదులుగా 152 మీటర్ల స్థాయిలో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రెండు మీటర్ల అదనపు స్థాయి తెలంగాణకు జల వినియోగం, నీటి తరలింపు పరంగా గణనీయమైన సాంకేతిక ప్రయోజనాన్ని కల్పిస్తుందని మంత్రి ఉత్తమ్ వివరించారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్లూపిఆర్‌ఎస్) నిర్వహించిన సాంకేతిక అధ్యయనాల ప్రకారం 148 మీటర్ల స్థాయిలో మహారాష్ట్ర భూభాగంలో సుమారు 1,150 ఎకరాలు, 152 మీటర్ల స్థాయిలో 2,500 ఎకరాలకు పైగా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 148 మీటర్ల వద్ద కూడా ముంపు ఉందని, 152 మీటర్ల వద్ద కూడా ముంపు ఉంటుంది. ముంపు అంశంపై మహారాష్ట్రతో సంప్రదింపులు అనివార్యమైనప్పుడు తెలంగాణకు సాంకేతికంగా అత్యధిక ప్రయో జనం కలిగించే 152 మీటర్ల స్థాయికి సమ్మతి సాధించేందుకు గత ప్రభుత్వం మరింత సమర్థంగా చర్చించి ఉండాల్సి ఉందని ఆయన తెలిపారు.











