
మనతెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జెఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెససర్ పోస్టుల అర్హతకు, పిహెచ్‌డి ప్రవేశాల కోసం నిర్వహించిన యుజిసి నెట్ జూన్ 2026 ప్రాథమిక కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఆదివారం ఉదయం విడుదల చేసింది. జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జెక్టులకు యుజిసి నెట్ పరీక్షను నిర్వహించింది. ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రూ.200 చెల్లించి ఈనెల 18 వరకు తెలియచేయాలని ప్రకటించింది. ప్రస్తుతం 84 సబ్జెక్టులకు ప్రొవిజనల్ ఆన్సర్ కీలు, అభ్యర్థుల రికార్డ్ చేసిన రెస్పాన్స్‌లను ఎన్‌టిఎ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఆన్సర్ కీలో ఏదైనా సమాధానం తప్పుగా ఉందని భావిస్తే అభ్యంతరాలను నమోదు చేయవచ్చు.
ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో వివిధ రకాల లోపాలపై ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్‌టిఎ డైరెక్టర్ పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.











