కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుడు, రాష్ట్ర అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లా రాంపూర్హాట్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆయన ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో సూసైట్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టీఎంసీలో కీలక నేతగా పేరున్న బెనర్జీ 2001 నుంచి 2006 వరకూ రాంపూర్హాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, బెంగాల్ విద్యా, వ్యవసాయ శాఖ మంత్రిగా మమతా బెనర్జీ ప్రభుత్వంలో పనిచేశారు. 2026లో రాంపూర్వాట్ నుంచి టీఎంసీ టిక్కెట్‌పై పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధ్రువ్ సాహా చేతిలో 24,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్నించి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా లేరని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, బెనర్జీ సూసైట్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పూ చేయేలేదని అందులో బెనర్జీ పేర్కొన్నారు. తారాపీఠ్ రాంపూర్హాట్ డెవలప్‌మెంట్ అథారిటీకి సంబంధించిన టెండర్ల నిర్ణయం, చెక్కుల జారీ, ప్లాన్ ఆమోదం, నో అబ్జెక్షన్ సర్టిఫెక్ట్ వ్యవహారాల్లో తనకెలాంటి పాత్ర లేదని, తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రావడమే తాను చేసిన పొరపాటని పేర్కొన్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని కూడా ఆ నోట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆయన మరణానికి కచ్చితమైన కారణాలపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.