
హైదరాబాద్: ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షల నెరవేరేలా, శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తామని డిజిపి సివి ఆనంద్ తెలిపారు. కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర కొత్త డిజిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల్లో సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని పోలీసు శాఖకు సూచించారు. నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని, మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారిందని తెలియజేశారు.
నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారని, నేరగాళ్లు అనుసరిస్తున్న టెక్నాలజీ పోలీసులకు కూడా సవాలు విసురుతుందని అన్నారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని, విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్ శాఖ ఒక బ్రాండ్ అని కొనియాడారు. శాంతిభద్రత విషయంలో రాజీ పడొద్దు అని నేరాల తీరు కూడా మారుతుందని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసు బృందం బాగా కృషి చేస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా.. డ్రగ్స్ ముఠాలు కూడా విస్తరిస్తున్నాయని సివి ఆనంద్ పేర్కొన్నారు. 2028 జూన్ వరకు డిజిపిగా కొనసాగనున్నారు.











