
మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోదాతో విహెచ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వి.హనుమంతరావుకు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లించనుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో నెలకు రూ. 50,000 ఇంటి అద్దె భత్యాన్ని పొందే వీలుంది. విధి నిర్వహణలో సొంత వాహనాన్ని ఉపయోగిస్తే నెలకు రూ. 30,000 కన్వేయన్స్ అలవెన్స్‌తో పాటు, రూ. 15,000 ఇంధన ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. దీనికి అదనంగా, డ్రైవర్‌తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని పొందే వెసులుబాటు కూడా ఆయనకు ఉంటుంది. అఖిల భారత సర్వీసు ఐఏఎస్ అధికారులు, మంత్రులతో సమానంగా వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా విహెచ్‌కు వర్తిస్తుంది.
కార్యాలయ సిబ్బంది కేటాయింపు..
బిసి సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. ఇందులో ఒక ప్రైవేట్ సెక్రటరీ (పిఎస్), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డిఈఓ), ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక డ్రైవర్ ఉంటారు. ఈ నియామకానికి సంబంధించిన మొత్తం ఖర్చులను బిసి సంక్షేమ శాఖ రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.













