చెన్నై: తమిళనాడులో టివికె అధినేత, హీరో విజయ్‌తో తెరవెనుక త్వరితగతి మంతనాలకు అన్నాడిఎంకె సిద్దం అయింది. ఈసారి రాజకీయ రంగ ప్రవేశంతోనే ఎక్కువ సీట్లతో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టివికె) రెండో స్థానంలో నిలుస్తుందని విశ్లేషణలు వెలువడ్డాయి. దీనితో అన్నాడిఎంకె సీనియర్ నేతలు కొందరు ఇప్పుడు విజయ్‌ను సంప్రదించి, డిఎంకెకు సవాలు విసరాలని వ్యూహాలకు దిగారని వెల్లడైంది.

అయితే ఇంతకు ముందే విజయ్ తనకు సిఎం పదవి కావాలని కోరుకుంటూ వస్తున్నాడు. అయితే మే 4వ తేదీ ఫలితాల్లో విజయ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది నిర్థారణ అయితే, అప్పుడు ఆయన తదుపరి పాత్ర ఖరారు అవుతుంది. అన్నాడిఎంకె , బిజెపిల ఎన్‌డిఎ కూటమి ఇప్పుడు విజయ్ అడుగులపై ఆసక్తి కనపరుస్తోంది. చాణక్య ఫలితాలలో విజయ్ పార్టీకి రెండో స్థానం రానుంది.

అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌లో విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు రావచ్చునని తెలిపారు. ఇక డిఎంకె, కాంగ్రెస్ ఇతర పార్టీల స్పా కూటమికి 92 నుంచి 110 వరకూ వస్తాయని తెలిపారు. ఇక అన్నాడిఎంకె బిజెపిల ఎన్‌డిఎకు 22 నుంచి 32 రావచ్చునని విశ్లేషించారు. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ కింగ్ మేకర్ స్థాయిని మించి ఏకంగా వస్తూనే రాజు పాత్ర పోషించే అవకాశాలు కనబడుతున్నాయి. టివికెకు 35 శాతం ఓట్ల బలం దక్కి ఉంటుందని అంచనావేశారు.