మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధంలో శనివారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని రష్యా సైన్యాన్ని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

యుద్ధం ముగింపు కోసం చర్చలు జరిపే ఉద్దేశంతో అమెరికా ప్రత్యేక ప్రతినిధిలు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్మన్‌లు మాస్కో చేరుకోవడంతో పుతిన్ తాజా ఆదేశాలిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు కొత్త, స్పష్టమైన ప్రతిపాదన తన వద్ద ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చెప్పిన మరుసటి రోజే అమెరికా ప్రత్యేక ప్రతినిధుల మాస్కో పర్యటన చోటుచేసుకుంది.

కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం చర్చల వేళ దాడులు చేసుకోవద్దని శుక్రవారంనాడు రష్యాకు ప్రతిపాదించారు. తమ వైపు నుంచి ఎలాంటి దాడులు ఉండవని, ప్రత్యర్థి నుంచి కూడా ఇదే ఆశిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య వైమానిక దాడులు పెరిగిన సమయంలో ఈ దౌత్య ప్రయత్నాలు జరుగుతుండటం విశేషం.

శుక్రవారం కీవ్‌లోన ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఎస్‌బీయూ ప్రధాన కార్యాలయంపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అత్యంత ప్రముఖ దాడుల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. రాత్రికి రాత్రి 167 డోన్లను రష్యా ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.