తమిళనాడు అసెంబ్లీలో మే 13న జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా అక్రమాలు, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిటిషన్ అస్పష్టమైన, ఆధారాలు లేని, ఊహాగానాలపై ఆధారపడిన ఆరోపణ లతో దాఖలైందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తమిళనాడులో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో 25 మంది తిరుగుబాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో సులభంగా విజయం సాధించింది.ఈ సందర్భంగా ప్రతిపక్ష డీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది.

కొంతమంది ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి మద్దతు కూడగట్టారని, ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కె.కె. రమేష్ తరఫు న్యాయవాది సి.ఆర్. జయ సుకిన్ కోర్టును కోరారు. విచారణ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.అయితే ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఆరోపణలను నిరూపించే నమ్మదగిన ఆధారాలు ఏవీ రికార్డులో లేవని, కేవలం సాధారణ ఆరోపణల ఆధారంగా విచారణకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్‌ను స్వీకరించేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొంటూ దాన్ని కొట్టివేసింది. మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు పూర్తి మెజారిటీ లేకపోయినా,

కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనిని ఆయన రాజకీయ చాతుర్యానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు అభివర్ణించాయి. అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించగా, ఆ ఆరోపణలను ముఖ్యమంత్రి విజయ్ పూర్తిగా ఖండించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడినటైై్లైంది.