
తిరుపతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో అంబానీ పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకున్న అనంతరం దర్శనం అనంతరం టిటిడి ఇఒ, ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అంతే కాకుండా అనంత్ అంబానీ తలనీలాలు సైతం సమర్పించారు. టిటిడికి ఆయన భూరీ విరాళం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎలక్ట్రిక్ బసులు విరాళంగా ఇవ్వడంతో పాటు 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లిస్తానని తెలియజేశారు. తిరుమలలో రిలయన్స్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని వంతారా ఏర్పాటు చేసిన విధంగా టిటిడి గోశాలకు సహాయం చేస్తానని స్పష్టం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 85,582 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,155 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.









