
ఐపిఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరిచయం అవసరం లేని పేరు. 15 ఏళ్ల వయస్సులోనే ఈ కుర్రాడు బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. తనదైన శైలీ దూకుడుతో బ్యాటింగ్ చేస్తూ.. రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్‌సన్ ఇచ్చిన ఓ ఛాలెంజ్‌ని సునాయాసంగా పూర్తి చేశాడు వైభవ్. తన యూట్యూబ్ ఛానల్‌లో పీటర్‌సన్ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే ఛాలెంజ్ నిర్వహిస్తున్నాడు. ఈ ఛాలెంజ్‌లో తాజాగా వైభవ్ పాల్గొన్నాడు. కేవలం 25 బంతుల్లోనే 14 సిక్సర్లు బాది 104 పరుగులు చేశారు. అయితే ఈ ఛాలెంజ్‌లో శ్రేయస్ అయ్యర్ రికార్డును మాత్రం వైభవ్ బద్దలుకొట్టలేకపోయాడు. అయ్యర్ కేవలం 22 బంతుల్లోనే ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు.
ఇదే ఎపిసోడ్‌లో వైభవ్ తన కోరికను వెల్లడించాడు. టి-20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని వైభవ్ తెలిపాడు. టి-20 క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 ఐపిఎల్ సీజన్‌లో గేల్ ఆర్సిబి తరఫున 175 పరుగులు చేశాడు. ఈ రికార్డును బద్దలుకొట్టడమే కాకుండా.. టి-20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని వైభవ్ మరోసారి స్పష్టం చేశాడు. కాగా, ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ 14 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టు ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్ఆర్ తలపడనుంది.











