మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత 95.15 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 96.26 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 94.07 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత, బాలుర కంటే 2.19 శాతం అధికంగా నమోదైంది. ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పివి శ్రీహరి,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణత నమోదైందని అన్నారు. విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

తెలంగాణ గురుకుల పాఠశాలలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ మోడల్ స్కూల్స్,ప్రైవేట్, కెజిబివి మెరుగైన ఉత్తీర్ణత నమోదయ్యిందని తెలిపారు. రాష్ట్రంలో 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. గురుకుల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర గురుకుల పాఠశాలలు, బిసి,ఎస్‌సి,ఎస్‌టి గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కెజిబివిలు, ప్రైవేట్ స్కూళ్లలో రాష్ట్ర సరాసరి కన్నా ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పదవ తరగతి వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,16,815 మంది విద్యార్థులు హాజరు కాగా 4,91,774 మంది ఉత్తీర్ణులయ్యారు.

ములుగు ఫస్ట్ .. హైదరాబాద్ లాస్ట్

టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా ములుగు జిల్లాలో 99.30 శాతం ఉత్తీర్ణులు కాగా అతి తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 89.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 99.03 శాతం ఉత్తీర్ణతతో నాగర్‌కర్నూల్ జిల్లా రెండవ స్థానంలో, 98.96 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి.

జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 14గా నిర్ణయించారు. ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. వెయ్యి ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 నుంచి మే 14 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజు చెల్లించాలి.

పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు : 5,16,815

ఉత్తీర్ణత సాధించవారు : 4,91,774

ఉత్తీర్ణత శాతం : 95.15

పరీక్షలకు హాజరైన బాలికలు : 2,56,337

ఉత్తీర్ణత సాధించిన బాలికలు : 2,46,747

బాలికల ఉత్తీర్ణత శాతం : 96.26

పరీక్షలకు హాజరైన బాలురు : 2,60478

ఉత్తీర్ణత సాధించిన బాలురు : 2,45,027

బాలుర ఉత్తీర్ణత శాతం : 94.07

సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత

సబ్జెక్ట్ హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

ఫస్ట్ లాంగ్వేజ్ 5,16,079 5,11,526(99.12 శాతం)

సెకండ్ లాంగ్వేజ్ 5,15,813 5,15,675(99.97 శాతం)

థర్డ్ లాంగ్వేజ్ 5,15,874 5,16,653(99.98 శాతం)

మ్యాథమెటిక్స్ 5,16,,653 5,03,541(97.46 శాతం)

జనరల్ సైన్స్ 5,16,692 5,08,493(98.41 శాతం)

సోషల్ స్టడీస్ 5,16,614 5,14,578(99.61 శాతం)

మీడియం వారీగా ఉత్తీర్ణత

మీడియం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం

తెలుగు 44,686 39,831 89.14

ఇంగ్లీష్ 4,64,589 4,45,376 95.86

ఉర్దూ 7,192 6,236 86.71

ఇతర మీడియం 348 331 95.11

మొత్తం 5,16,815 4,91,774 95.15