ముంబై : ఉధ్ధవ్ థాకరే నేతృత్వం లోని శివసేన (యుబిటి)కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలకు మహారాష్ట్ర ప్రభుత్వం ‘వైప్లస్’ భద్రతను కల్పించింది. ఈ ఎంపీలు ఢిల్లీలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో జరిగిన కీలకమైన పార్టీ పార్లమెంటరీ సమావేశానికి గైరు హాజరు కావడంతో పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర హెచ్చరికలు, నిరసనలు ఎదురుకావడంతో ఈ భద్రతను పెంచారు. ఈమేరకు సంజయ్ దినా పాటిల్ ,సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భాసాహెబ్ వాక్చోరే , నాగేశ్ పాటిల్‌అష్టికర్, ఓం ప్రకాష్ రాజే నింబాల్కర్‌లకు భద్రత కల్పించారు.

ఈ నిర్ణయంపై శివసేన (యుబిటి) వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పార్టీ నేత సంజయ్ రౌత్ తిరుగుబాటుదారులను ద్రోహులుగా తప్పుపట్టారు. వాషిమ్‌లోని స్థానిక శివసేన (యుబిటి) నాయకులు బుధవారం సంజయ్ దేశ్‌ముఖ్‌ను ఉద్దేశించి రాజీనామా చేయకుండా పార్టీ మారితే ఆయన కారును తగులబెడతామని హెచ్చరించారు. ధారాశివ్ లోని పార్టీ కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తూ ఎవరైతే పార్టీని విడిచి వెళ్తున్నారో వారి ముఖాలపై పేట పూస్తామని హెచ్చరించారు.