సింగిల్ స్క్రీన్స్‌కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, టిఎఫ్‌సిసి అధ్యక్షుడు సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు తదితరులు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుందని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం అన్నారు.

ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పని తీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్ధం అయిందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30 వ తేదీ వరకూ , అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజ్ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందని తనకు నమ్మకం వుందని, ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.

సమావేశం అనంతరం మీడియాతో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ “పర్సెంటేజ్ విధానానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవికి వివరించాం. సమస్యలను చిరంజీవి ఎంతో శ్రద్ధగా విన్నారు. అర్ధం చేసుకున్నారు. ఎగ్జిబిటర్స్‌కి మాటిచ్చారు. వారం కిందట ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు. సమస్యని కమిటీకి అప్పగించి కమిటీ ద్వారా రెండు రోజుల్లో పరిష్కారిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను ఛాంబర్ అధికారికంగా ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు”అని అన్నారు. ఈ సమావేశంలో శ్రీధర్, సునీల్ నారంగ్ , భరత్ నారంగ్ , శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్ , రాజ్ తదితరులు పాల్గొన్నారు.