చెనై: తమిళనాడులో టివికె నాయకులు, హీరో విజయ్ సారధ్యంలో నూత న ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అసెంబ్లీలో అత్యధిక స్థానాలు పొందిన టివికె పార్టీ తరఫున విజయ్ ఇప్పుడు ప్రభుత్వ స్థాపనకు సిద్ధం అయ్యారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్మెంట్ కోసం సోమవారం అభ్యర్థించారు.తాము అత్యధిక సీట్లు పొందిన పార్టీ హోదాలో ప్రభుత్వ స్థాపనకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు అవకా శం ఇవ్వాలని విజయ్ తమ లేఖలో తెలిపారు. గవర్నర్‌కు ఆయన అభ్యర్థన పంపించిన విషయాన్ని అధికార వర్గాలు నిర్థారించాయి. ఈ నెల ఏడున విజయ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడైంది. ఈసారి ఎన్నికలలో ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్

118ని దక్కించుకోవడంలో విజయ్ విఫలం అయ్యారు. అయితే ఆయనకు ఇతర పార్టీలతో పోలిస్తే అత్యధికంగా 108 స్థానాలు వచ్చాయి. అదీ ఎవరి మద్దతు లేకుండా ఈ విజయం దక్కింది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తే సభలో తమ బల నిరూపణకు దిగుతామని విజయ్ గవర్నర్‌కు తెలియచేశారు. ఆయన పార్టీకి మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు అత్యవసరం. దీనిని ఆయన సునాయాసంగానే దక్కించుకోగలరు. అయితే ఏ కూటమి నుంచి ఆయన మద్దతు తీసుకుంటారనేది కీలక ప్రశ్న అయింది. బిజెపి , అన్నాడిఎంకెల ఎన్‌డిఎ నుంచి మద్దతు విషయంలో బహిరంగంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే వారు ప్రభుత్వానిక బయట నుంచి మద్దతు ఇస్తారని వెల్లడైంది. లేకపోతే ఆయన కాంగ్రెస్, పిఎంకెల నుంచి మద్దతు పొందుతారు. అయితే ఈ పార్టీలు రెండేసి మంత్రిపదవులు కోరుతున్నాయి.


రాహుల్‌తో విజయ్ ఫోన్ మంతనాలు

సోమవారం విజయ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాందీతో ఫోన్‌లో చాలా సేపు మంతనాలు జరిపినట్లు వెల్లడైంది. ఎన్‌డిఎ వర్గాలు కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉండటంతో ప్రభుత్వ స్థాపనక మార్గం సుగమం అయిందని వెల్లడైంది. ఈ నెల 7వ తేదీన (గురువారం) విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మంగళవారం వార్తలు వెలువడ్డాయి. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో ఏకకాలంలోనే విజయ్ చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం అయింది. విసికె, సిపిఎం సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వ స్థాపనకు సహకరిస్తామని ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో విజయ్ సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం అయింది. సొంతంగా భారీ బలం సాధించుకున్న విజయ్ సోమవారం పార్టీ శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెనువెంటనే ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడినట్లు వెల్లడైంది.

నివాసంలో సందడి .... ప్రముఖుల రాక

చెన్నైలోని పట్టినంపక్కమ్ విజయ్ నివాసం వచ్చిపోయే ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, పలువురు హీరోయిన్లు, రాజకీయ పార్టీల నేతల రాకతో సందడిగా మారింది. ఏడున ప్రమాణస్వీకారానికి ముందు కేబినెట్ ఏర్పాటు అనేది కీలకమైన అంశం కావడంతో విజయ్ దీనిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. పార్టీ పెట్టిన తరువాత కొద్ది కాలానికే ఇతరులకు ఎవరికి సాద్యం కాని రీతిలో సొంతంగా అధికారం స్థాపించే దశకు వచ్చిన విజయ్‌కు రాజకీయాలు కోత్త. ఈ దశలో కేంద్రం, రాష్ట్రంలోని పార్టీలను దృష్టిలో పెట్టుకుని సరైన సమన్వయ సాథనతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ఆయన తెరవెనుక ఉన్న కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులతో, ప్రముఖ మీడియా వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు స్పష్టం అయింది.

వ్యూహకర్తలకు పెద్ద పీటలు ?

తమిళనాడులో దాదాపు 6 దశాబ్దాల తరువాత తొలిసారి ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టిన వ్యక్తిగా విజయ్ మారారు. దీనితో ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఆయన గ్లామర్ విపరీతంగా పెరిగింది. రెండు పార్టీల గుండుగుత్త అధికారానికి చెక్ పెట్టిన విజయ్ ముందు ఇప్పడు ప్రభుత్వ స్థాపనకు బల సమీకరణ, తరువాతి క్రమంలో కేబినెట్ కూర్పు కీలకం అయింది. 7వ తేదీన విజయతో పాటు తొమ్మండుగురు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తారని వెల్లడైంది. ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో స్థానం దక్కించుకోనున్న వారిలో డిఎంకె, అన్నాడిఎంకె నుంచి టివికెలోకి వచ్చిన ప్రముఖులు ఉంటారని వెల్లడైంది. మంత్రులు కానున్న వారిలో ఎన్ ఆనంద్, ఐఆర్‌ఎస్ మాజీ అధికారి అరుణ్‌రాజ్ , సిటిఆర్ నిర్మల్ కుమార్, కెఎ సెనెగోట్టయియన్ , మేరీ విల్సన్ , రాజ్‌మోహన్ , విఎస్ బాబు ఉంటారు. వీరిలో బాబు ఇటీవలి ఎన్నికలలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఓడించారు.