
రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ పాలన కొనసాగుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేండ్లయినా ఏ ఒక్క సంక్షేమాన్ని అమలుచేయలేదని విమర్శించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఫ్లై ఓవర్లను, టిమ్స్ భవనాలను, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించడం తప్పితే ఇప్పటివరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నైనా చేపట్టారా అని ప్రశ్నించారు. 65 ఏండ్ల దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చెత్తపాలన చూసిన దేశ ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటుంటే తెలంగాణ ప్రజలు దరిద్రాన్ని నెత్తినెత్తుకొని ఇప్పుడు బాధపడుతున్నారన్నారు.
గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో రూ.వేల కోట్లు వెచ్చించి ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్‌లను వేసి నీటి సమస్యను మెరుగుపర్చామని, తిరిగి అధికారంలోకి వస్తే నగరంలో నిరంతర నీటి సరఫరా చేసే బాధ్యత తనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కూకట్‌పల్లి ఎంఎల్ఎ మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎ కెపి వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు కె.నవీన్‌రావు, శంభీపూర్‌రాజు, రాగిడి లకా్ష్మరెడ్డి, సభ్యత్వ నమోదు ఇంచార్జి గజ్జెల నగేష్, నియోజకవర్గం బిఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జి.వెంగళ్‌రావు, మందాడి శ్రీనివాస్‌రావు, కె.భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.











