తమ న్యాయమైన డిమాండ్ల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, పోలీస్ అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయించడాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలన ఇదేనా..? అని ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా పలు రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.